పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా వైమానిక దళానికి చెందిన రెండు సీ-130 విమానాలను కూల్చేసినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ( IRGC) ప్రకటించింది. ఇస్ఫహాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన రెండు సీ-130 విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చేసినట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన F-15E ఫైటర్‌ జెట్‌‌ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అమెరికాకు చెందిన ఓ పైలెట్ గల్లంతు కాగా.. ఆ పైలట్‌ కోసం అమెరికా రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం దక్షిణ ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లోని ఓ మూతపడిన విమానాశ్రయాన్ని అమెరికా ఉపయోగించుకుందని ఇరాన్ సైన్యం వెల్లడించింది. పైలట్‌ను రక్షించే నెపంతో, దక్షిణ ఇస్ఫహాన్‌లోని ఒక మూతపడిన విమానాశ్రయంలో మోసపూరితమైన మిషన్‌ను అమెరికా ప్లాన్ చేసిందన్న ఇరాన్ సైన్యం.. ఈ ఆపరేషన్‌ను పూర్తిగా భగ్నం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇరాన్ సైన్యం కేంద్ర కమాండ్ ప్రతినిధి ఖతమ్ అల్ అన్బియా ఇబ్రహీం జొల్ఫఘారి అన్నారు. ఈ ఆపరేషన్‌లో రెండు సీ -130 సైనిక రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ధ్వంసమైనట్లు తెలిపారు. మరోవైపు గల్లంతైన పైలెట్‌ను గుర్తించేందుకు అమెరికా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా అనేక ఎగిరే వస్తువులను.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ధ్వంసం చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. మరోవైపు.. దక్షిణ లెబనాన్‌లోని కఫర్ హట్టా ప్రాంతంపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు లెబనాన్ సివిల్ డిఫెన్స్ విభాగం అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతం ఇజ్రాయెల్ సరిహద్దుకు చాలా దూరంలో ఉందని తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఆదేశించగా.. ఆ కుటుంబమంతా అక్కడి నుంచి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నట్లు లెబనాన్ అధికారులు తెలిపారు. కారు లేకపోవటంతో వారంతా ఒక బంధువు కోసం ఎదురుచూస్తున్నారని.. ఈ సమయంలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆరుగురు కుటుంబసభ్యులతో పాటుగా, ఆ వ్యక్తి కూడా చనిపోయినట్లు లెబనాన్ అధికారులు తెలపారు.