ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీవోఏల (యానిమేటర్లు/గ్రామ సంఘ సహాయకులు)కు ఇచ్చిన హామీని నెరవేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) పరిధిలో 28,500 మంది వీవోఏలు ఉన్నవారు.. వారందరికి స్మార్ట్‌ఫోన్లు అందజేశారు. విజయవాడలోని రామ‌వ‌ర‌ప్పాడు ఎం కన్వెన్షన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వీవోఏలకు ఫోన్లలను పంపిణీ చేశారు.. ఒక్కో ఫోన్ ధర రూ. 15 వేల వరకు ఉంది. గతంలో 2016 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మళ్లీ ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు వీవోఏలకు మొబైల్స్ అందించారన్నారు మంత్రి కొండపల్లి. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్మార్ట్ ఫోన్లను మొత్తం 28,500 వీవోఏలకు పంపిణీ చేయ‌డం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వీవోఏలకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతామన్నారు మంత్రి. వీవోఏల సేవల్ని గ్రామస్థాయిలో మరింత సులభతరం చేస్తామని.. మొబైల్స్ ద్వారా డిజిటల్ కమ్యూనికేషన్ బలోపేతం చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం నకిలీ సంఘాలపై నిరంతరం నిఘా పెడుతోందన్నారు కొన్ని నకిలీ సంఘాలను ఇప్పటికే గుర్తించి తొలగించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని.. కానీ చాలామంది మహిళలకు వీటి గురించి తెలియడం లేదన్నారు. ఎంఎస్‌ఎంఈ ద్వారా గ్రామాల్లో మహిళలు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తే సహకారం అందిస్తామన్నారు మంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలని చెబుతుంటారని.. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలను 30 ఏళ్ల క్రిత‌మే ప్రారంభించార‌ని.. ఈ సంఘాల‌తో నేడు రాష్ట్రంలో మ‌హిళా నాయ‌కత్వ స్ఫూర్తి కనిపిస్తోందన్నారు. హోంమంత్రి కంటే తనకే ప్రోటోకాల్ ఎక్కువన్నారు. తాను రాష్ట్రంలో ఏ డ్వాక్రా మహిళ ఇంటికి వెళ్లినా అతిథినేనని.. ఏ ఇంట్లో అయినా భోజనం చేసే స్వేచ్ఛ ఉందన్నారు. సెర్ప్‌లో పనిచేస్తే ప్రజలకు ఏం చేస్తే మొప్పు పొందగలమో, ఆనందం చూడగలమో తెలుస్తుందన్నారు. మొత్తం మీద రాష్ట్రంలో వీవోఏలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మొబైల్స్ పంపిణీని ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది.