తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.. అనంతరం హుండీల ద్వారా తమకు తోచిన విధంగా కానుకల్ని సమర్పిస్తుంటారు. అయితే కొందరు భక్తులు గతంలో రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను ఇప్పటికీ తిరుమల శ్రీవారి హుండీలో సమర్పిస్తున్నారు. ఇలా టీటీడీ దగ్గర రూ.400 కోట్లకుపైగా రద్దైన నోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీటీడీ ఈ రద్దైన నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని టీటీడీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది.. కానీ అంగీకరించలేదు. రూ.500, రూ.1000 నోట్ల సంగతి అలా ఉంటే.. కొంతమంది భక్తులు రూ.2వేల నోట్లను కూడా తిరుమల శ్రీవారి హుండీలలో కానుకలుగా సమర్పిస్తున్నారు.. ప్రతి నెలా ఇలా రూ.2వేల నోట్లు కూడా హుండీల్లో భక్తులు సమర్పిస్తున్నారు. అయితే ఈ రూ.2వేల నోట్లను మాత్రం మార్చుకునేందుకు అవకాశం ఉంది.. టీటీడీ ప్రతి రెండు నెలలకు ఒకసారి చెన్నై ఆర్బీఐ రీజినల్ ఆఫీస్‌లో ఈ నోట్లను మార్చుకుంటోంది. టీటీడీకి ఈ రద్దైన నోట్ల వ్యవహారం తలనొప్పిగా మారింది.. రూ.2వేల నోట్లను మార్చుకుంటున్నా.. రూ.500, రూ.1000 నోట్ల అంశం మాత్రం తలనొప్పిగా మారింది.కేంద్రం 2016 నవంబర్ 8న రూ.500తో పాటుగా రూ. 1000 నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో నల్లధనం, అవినీతి, నకిలీ నోట్లను అరికట్టడం కోసం కేంద్రం నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం కరెన్సీలో 86% రూ. 500, రూ. 1000 నోట్లు చలామణి ఉండటంతో వాటిని రద్దు చేసింది. ఆ తర్వాత కేంద్రం కొత్తగా రూ.500తో పాటుగా రూ.2వేల నోటును కూడా తీసుకొచ్చింది.. అయితే 2023 మే 19న రూ.2వేల నోట్లను తిరిగి ఉపసంహరించుకుంది. దేశవ్యాప్తంగా జనాలు ఈ రూ.2వేల నోట్లను అన్ని బ్యాంక్ బ్రాంచుల ద్వారా డిపాజిట్, ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అయితే కొందరు భక్తులు ఇప్పటికీ తిరుమల శ్రీవారి హుండీలో రద్దు చేసిన రూ.500, రూ.1000, రూ.2వేల నోట్లను కానుకలుగా సమర్పిస్తున్నారు. మరి టీటీడీ ఈ రద్దైన నోట్ల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.