Share Price: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం.. క్రూడాయిల్ ధరలు గరిష్ఠ స్థాయిల్లో ఉన్న నేపథ్యంలో.. . ఆరంభంలో స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ సూచీలు క్రమక్రమంగా పతనం అవుతున్నాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఏప్రిల్ 6 ఉదయం 10 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 350 పాయింట్ల నష్టంతో 72,960 స్థాయిలో ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే 95 పాయింట్ల పతనంతో 22,610 మార్కు వద్ద ఉంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 500 పాయింట్లకుపైగా కూడా పతనం అయింది. తర్వాత కాస్త పుంజుకుంది. అయితే రిలయన్స్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా పలు హెవీ వెయిట్ స్టాక్స్ పడుతున్నప్పటికీ.. ఐటీ స్టాక్స్ మాత్రం అన్నీ రాణిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా ఇలా అన్నీ ఒక శాతానికిపైగా పెరిగాయి. ఇదే సమయంలో ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో షేరు ఇంట్రాడేలో 3 శాతం వరకు పెరిగింది. కిందటి సెషన్‌లో ఈ స్టాక్ ధర రూ. 194.91 వద్ద ముగియగా ఇవాళ ఒక శాతానికిపైగా లాభంతో రూ. 197 వద్ద ఓపెన్ అయింది. అక్కడితోనే ఆగలేదు.. ఇంట్రాడేలో ఇంకా పెరిగి ఒక దశలో 3 శాతానికిపైగా పుంజుకొని రూ. 201.18 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 2 శాతం వరకు లాభంతో కొనసాగుతోంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 2.07 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 273.10 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 186.50 గా ఉంది. ఇటీవల ఐటీ స్టాక్స్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కారణంగా అన్నీ భారీగా పతనం అయ్యాయి. ఇది కూడా గరిష్ఠాల నుంచి భారీగా పతనమైంది. ఇప్పుడు విప్రో షేరు ఇలా ఒక్కసారిగా పుంజుకునేందుకు ప్రధాన కారణం.. విప్రో నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇది సింగపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఆహార, వ్యవసాయ వ్యాపార దిగ్గజం ఓలమ్ గ్రూప్‌కు చెందిన ఐటీ విభాగం మైండ్‌స్ప్రింట్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. సుమారు 375 మిలియన్ డాలర్లకు దక్కించుకోనుంది. భారత కరెన్సీలో చూస్తే దీని విలువ సుమారు రూ. 3500 కోట్ల వరకు ఉంటుంది. సింగపూర్, భారత్‌లో ఈ కంపెనీకి సుమారు 3200 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. 2026, జూన్ చివరినాటికి ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.