రాష్ట్రంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదాల్లో గాయపడిన వారికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స అందిస్తేనే వారి ప్రాణాలను కాపాడవచ్చు. కొన్నిసార్లు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఆస్పత్రికి ఆలస్యంగా తీసుకుపోవడం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడలేకపోయామని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి గంటలోనే చికిత్స అందిస్తే.. వారు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. దాన్నే గోల్డెన్ అవర్ ట్రీట్‌మెంట్ అంటారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించడమే లక్ష్యంగా స్టేట్ ట్రామా కేర్ పాలసీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూపొందించింది. ఈ స్టేట్ ట్రామా కేర్ పాలసీలో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. కేవలం ట్రామా కేర్ సెంటర్లు మాత్రమే కాకుండా.. బాధితుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి మెరుగైన చికిత్సను అతి తక్కువ సమయంలో అందించేందుకు యాక్సిడెంట్ స్పాట్ నుంచి టెర్షియరీ కేర్ హాస్పిటల్ వరకు 4 అంచెల వ్యవస్థను పటిష్టం చేయనుంది. ఈ నెట్‌వర్క్ ద్వారా బాధితులకు మెరుగైన వైద్యం.. సరైన సమయంలో చికిత్స అందుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ స్టేట్ ట్రామా కేర్ పాలసీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పేషెంట్ల కండిషన్‌‌‎ను బట్టి వారికి చికిత్స అందించేలా ఈ ఫోర్ లెవల్ ట్రామా కేర్ నెట్‌‌వర్క్‌‎ను తయారు చేశారు. మొత్తం 4 అంచెల్లో సేవలను విభజించి చికిత్సను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నాలుగో లెవెల్‎లో భాగంగా ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకునే 108 అంబులెన్స్.. మొదటి రెస్పాండర్‌‎గా పనిచేస్తుంది. ఆ అంబులెన్స్‌‎లోనే ప్రాథమిక చికిత్స అందిస్తూ దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలిస్తారు. దీని కోసం ప్రతీ ట్రామా కేర్ సెంటర్‎కు ఒక అంబులెన్స్‎ను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత మూడో లెవెల్‎లో జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్న ట్రామా కేర్ సెంటర్లకు తరలించి బాధితులకు చికిత్స అందిస్తారు. ఆ తర్వాత రెండో లెవెల్‎లో జిల్లాల్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ట్రామా చికిత్స, పెద్ద ఆపరేషన్లు చేస్తారు. ఇక చివరిదైన మొదటి లెవెల్‎లో అత్యంత విషమంగా ఉన్న కేసులను హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, త్వరలో ప్రారంభం కానున్న టిమ్స్ ఆస్పత్రులతోపాటు వరంగల్‌‌ ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లకు తరలించి అడ్వాన్స్‌‌డ్ ట్రీట్‌‌మెంట్ అందిస్తారు.ప్రస్తుతం రాష్ట్రంలోని హైవేలపై ఎక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు 108, ఆరోగ్యశ్రీ సంస్థలు కలిసి సమగ్ర సర్వేను చేపట్టాయి. ఈ సర్వేలో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 911 బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు గుర్తించారు. వీళ్లు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ ఆధారంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న 74 ట్రామా కేర్ సెంటర్ల లొకేషన్లను ఖరారు చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 35 కిలోమీటర్లలోపే చికిత్స అందించేలా నెట్‌వర్క్‌ను రూపొందించారు. ఈ భారీ ట్రామా కేర్ పాలసీ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సాయం అందించనుంది. మొత్తం 74 ట్రామా కేర్ సెంటర్లలో అత్యాధునిక మెడికల్ పరికరాలు, వెంటిలేటర్లు, ఎమర్జెన్సీ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో ట్రామా కేర్ సెంటర్‎ను రూ.5.3 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. రోడ్లపై ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల్లోనే అక్కడికి అంబులెన్స్ చేరుకోవడం.. పేషెంట్ పరిస్థితిని బట్టి ఏ హాస్పిటల్‌‌‎కు తరలించాలి అనేది మొత్తం ఒక చైన్ సిస్టమ్‎లా పనిచేయనుంది. ఈ విధానం అమలైతే రోడ్డు ప్రమాదాల్లో సరైన సమయంలో చికిత్స అందకుండా చనిపోతున్న వారి ప్రాణాలను కాపాడవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.