ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాలలో రెండు రోజుల పాటూ వర్షాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండల తీవ్రత కొనసాగుతుంటే.. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర - పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం, రాయలసీమపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇవాళ, మంగళవారం రోజు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇవాళ పోలవరం జిల్లా చింతూరు.. ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం రోజు ఎండలు రాష్ట్రవ్యాప్తంగా 66 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.3 డిగ్రీలు నమోదైంది. ఇదిలా ఉంటే.. ఆదివారం రోజు విభిన్నమైన వాతావరణం కనిపించింది. ఓ వైపు ఎండలు.. మరోవైపు పలు చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ఉదయగిరి, కలువాయి మండలాల్లో కోత దశలో ఉన్న వరిపైరు నేలమట్టమైంది. ఈ వాన దెబ్బకు మామిడి కాయలు నేలరాలాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం పిడుగుపడి ఇద్దరు చనిపోయారు. మందస మండలం పెద్ద కేసుపురానికిచెందిన తల్లి, కూతురు మడియా కృష్ణకుమారి, కుమార్తె యోగేశ్వరితో కలిసి ఆదివారం మధ్యాహ్నం తోటకు వెళ్లారు. అక్కడ పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. వెంటనే పిడుగుపడి ఇద్దరూ చనిపోయారు. తిరుపతి జిల్లాశ్రీకాళహస్తి మండలం కలవగుంటలో కూడా మరొకరు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. కల్లుగీత కార్మికుడు కామరాజ్‌పై పిడుగుపడి అక్కడికక్కడే చనిపోయాడు.