హైదరాబాద్ నాదర్‌గుల్ సమీపంలోని లచ్చమ్మకుంట చెరువు విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావు.. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుటుంబంపై సంచలన ఆరోపణలకు తెరతీశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఏకంగా రూ.7 వేల కోట్ల భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. పేదల భూముల విషయంలో పెద్ద నేతలే గద్దలుగా మారితే ఎలా అని నిలదీశారు. లచ్చమ్మకుంట భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో హైడ్రా అధికారులపైనా హరీష్ రావు మండిపడ్డారు. అయితే ఇవన్నీ రాజకీయ వ్యాఖ్యలు అని.. ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గానీ, ఆయన కుమారుడు హర్ష రెడ్డికి గానీ ఎలాంటి ప్రమేయం లేదని కోహినూర్ గ్రూప్ సంస్థ స్పష్టం చేసింది. దళితుల భూములను భక్షించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించిన హరీష్ రావు.. నాదర్‌గుల్‌‌లో పేదలను వారి భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నాదర్‌గుల్‌ భూముల కోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం జరుగుతుందని.. ఆ భూమి తనదేనని రాజ్ బహుదూర్ కోర్టుకు ఎక్కారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చామని.. ఇప్పుడు ఆ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు.కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌లో ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొన్నట్లు హరీష్ రావు చెప్పారు. భూములను కాపాడాల్సిన బాధ్యత ఆర్డీవోది కాగా.. స్థానిక రైతులు రెవెన్యూ అధికారులకు, హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని సీఎం రేవంత్ రెడ్డి లాకుంటున్నారని ఆరోపించారు. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రే భూముల ఆక్రమణ వెనుక ఉంటే అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారని నిలదీశారు. భూములను ఆక్రమిస్తే ఎవర్నీ వదలను అని అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ భూములపై హైడ్రా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని తెలిపారు.లచ్చమ్మకుంట చెరువు ఆక్రమణకు గురవుతుంటే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ చెరువులను కాపాడుతా అనే హైడ్రాకు కళ్లు కనబడటం లేదా అని నిలదీశారు. సోమవారం రోజున హైడ్రా కమిషనర్ లచ్చమ్మకుంట భూముల వద్దకు రావాలని.. లేదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో తానే వెళ్తానని హైడ్రా కమిషనర్‌కు హరీష్ రావు సవాల్ చేశారు. పేదోళ్ల ఇళ్లను కూల్చేసి అరెస్ట్ చేసే హైడ్రా.. పెద్దోళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మరోవైపు 80 ఎకరాల గుట్టలను మాయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఈ నెల 7వ తేదీన ఈ లచ్చమ్మకుంట భూములపై సుప్రీంకోర్టులో విచారణ ఉందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఆ భూములను కోహినూర్‌ గ్రూప్ సంస్థకు చెందిందని బోర్డు పెట్టినట్లు హరీష్ రావు పేర్కొన్నారు. శిల్పా ఇన్‌ఫ్రా సంస్థ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిది అని.. ఈ భూముల వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారని వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ నాదర్‌గుల్‌ భూములపై బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని కోహినూర్‌ గ్రూప్‌ సంస్థ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్ష రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ మేరకు కోహినూర్ గ్రూప్ సంస్థ డైరెక్టర్‌ అమ్జాద్‌ ఖాద్రీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 613లో ఉన్న 373.22 ఎకరాల భూ హక్కులపై జరుగుతున్న ప్రచారంపై నిజాలను వెల్లడించింది. నిజానికి ఆ భూమి రాజా శివ్‌రాజ్‌ బహదూర్‌కు చెందిన ప్రైవేట్‌ ఆస్తి అని.. 2015లో ఆయన వారసులే హక్కుదారులు అని 2015లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపింది.