ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్వల్పంగా పెరిగిన ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో చదరపు అడుగుకు ఎంతంటే?

Wait 5 sec.

Hyderabad Housing Sales: రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొంత కాలంగా మందగమనం కొనసాగుతోంది. ఏమైందో ఏమో గానీ ఈ క్యాలెండర్ ఇయర్ జనవరి- మార్చి సమయంలో దేశవ్యాప్తంగా చూస్తే ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఇటీవల ప్రాప్‌ఈక్విటీ రిపోర్ట్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. జనవరి- మార్చిలో దేశంలోని 9 ప్రధాన నగరాల్లో హౌసింగ్ సేల్స్.. . విక్రయాలు దాదాపు 13 శాతం మేర తగ్గాయి. ఇంకా హైదరాబాద్ మార్కెట్లో కూడా హౌసింగ్ సేల్స్ 16 శాతం వరకు తగ్గాయి. ఢిల్లీ- NCR, బెంగళూరులో మాత్రమే స్వల్పంగా అమ్మకాలు పెరిగాయని రిపోర్ట్ పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా మరో రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్.. ధరల పెరుగుదలపై తాజాగా రిపోర్ట్ వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ జనవరి- మార్చి త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 2 శాతం మేర పెరిగినట్లు పేర్కొంది. ఇక్కడ పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో వినియోగదారుల సెంటిమెంట్ ప్రతికూలంగా మారడమే ఇందుకు కారణం అని తెలిపింది. అక్టోబర్- డిసెంబరుతో చూస్తే చదరపు అడుగు సగటు ధర రూ. 9260 నుంచి రూ. 9456 కు పెరిగినట్లు పేర్కొంది. ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే చదరపు అడుగు సగటు ధర రూ. 8868 నుంచి 7 శాతం మేర పెరిగినట్లు అనరాక్ వివరించింది. 7 ప్రధాన నగరాలు ఢిల్లీ- NCR, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), బెంగళూరు, పుణె, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై మార్కెట్లను పరిశీలించి ఈ రిపోర్ట్ విడుదల చేసింది. ఇక త్రైమాసికం పరంగా చూస్తే 7 నగరాల్లో గృహ విక్రయాలు 7 శాతం వరకు తగ్గాయని.. విలువ పరంగా 6 శాతం తగ్గినట్లు తెలిపింది. హైదరాబాద్ నగరంలో 2025 అక్టోబర్- డిసెంబరులో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున రూ. 7830 గా ఉండగా.. 2 శాతం మేర పెరిగి రూ. 7,990 కి చేరినట్లు అనరాక్ వెల్లడించింది. ఇతర నగరాల్లో చూస్తే ఢిల్లీ- NCR లో 3 శాతం మేర పెరిగి చదరపు అడుగుకు రూ. 9,620 కి చేరింది. కోల్‌కతాలోనూ 3 శాతం మేర ఎగబాకి చదరపు అడుగుకు రూ. 6,120 నుంచి రూ. 6,290 కి చేరింది. బెంగళూరు, పుణెల్లోనూ 2 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరగ్గా.. చదరపు అడుగుకు సగటున వరుసగా రూ. 9,310; రూ. 8,220 కి చేరాయి. ఎంఎంఆర్, చెన్నైల్లో వరుసగా ఒక్క శాతం చొప్పున పెరిగి చదరపు అడుగుకు ఇప్పుడు ధరలు రూ. 17600, 7165 గా ఉన్నాయి.