సంజూ శాంసన్ డిజాస్టర్ షో.. ఏరికోరి తెచ్చుకుంటే మేకై కూర్చున్నాడుగా!

Wait 5 sec.

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఫ్యాన్స్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఐపీఎల్ 2025 పరాభవాలకు ఈ సీజన్‌లో లెక్క సరిచేస్తాము అన్నంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. దానికి ఏకైక కారణం సంజూ శాంసన్, అందులోనూ టీ20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చేసి భారత్‌ను ఛాంపియన్‌గా నిలపడమే. కానీ.. ఇప్పుడు అదే ఏరికోరి తెచ్చుకుంటే సీఎస్కేకి ఏకుకు మేకై కూర్చున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల్లో సంజూ శాంసన్‌ ఫస్ట్ విక్టిమ్‌గా కనిపిస్తున్నాడు. సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. పైగా అన్నీ దారుణ ఓటములే. ఈ మూడు మ్యాచ్‌లలో సీఎస్కే ఓపెనర్లు ఒక్క మ్యాచ్‌లో కూడా 15కి పైగా భాగస్వామ్యం నెలకొల్పలేదు. సంజూ శాంసన్ అయితే ఒక్క మ్యాచ్‌లో కూడా పదికి పైగా పరుగులు చేయలేకపోయాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సంజూ శాంసన్ - రుతురాజ్ గైక్వాడ్ తొలి వికెట్‌కు 14 పరుగులు చేయగా.. సంజూ శాంసన్ 6 పరుగులకే అవుటయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా 14 పరుగులే, ఆ మ్యాచ్‌లో సంజూ 7 పరుగులు చేశాడు. ఇక ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో 9 పరుగులకే మొదటి వికెట్ పడింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 9 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 22 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం మ్యాచ్‌కి పది చొప్పున 30 పరుగులు కూడా చేయలేకపోయాడు. ధోనీ తర్వాత సీఎస్కేకు ఆ స్థాయి ఫేమ్ కావాలనే ఉద్దేశంతో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌ను తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో భారీ ట్రేడ్ ఒప్పందం కూడా చేసుకుంది. అందుకోసం ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరన్‌ను కూడా సీఎస్కే వదులుకుంది. సంజూ కోసం ఇంత చేసిన సీఎస్కేకి.. సంజూ మాత్రం కనీస న్యాయం కూడా చేయలేకపోయాడని అభిమానులు వాపోతున్నారు. మరి రానున్న మ్యాచ్‌లలో అయినా తన తీరు మార్చుకుని మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేస్తాడేమో చూడాలి!