రాజస్థాన్ రాయల్స్ కీ స్పిన్నర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన రవి బిష్ణోయ్.. టీ20ల్లో అతి చిన్న వయస్సులో భారత్ తరఫున 200 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 170 టీ20 మ్యాచ్‌లు ఆడిన రవి బిష్ణోయ్ 25 సంవత్సరాల 211 రోజుల వయస్సులో 200 వికెట్లు పడగట్టాడు. భారత్ తరఫున రవి బిష్ణోయ్ ఈ మార్క్ అందుకోగా.. ప్రపంచ రికార్డు మాత్రం రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ ఖాన్ కేవలం 23 ఏళ్ల వయస్సులోనే 200 వికెట్లు పూర్తి చేశాడు. భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా మాత్రం ఇప్పటికీ యుజ్వేంద్ర చాహల్ ఉండటం విశేషం. ఐపీఎల్ 2026లో హై టెన్షన్ నెలకొల్పిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో రవి బిష్ణోయ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అప్పటి వరకు గుజరాత్ వైపు ఉన్న విజయాన్ని ఒక్కసారిగా రాజస్థాన్ వైపు తిప్పేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే కేవలం 8 పరుగులే ఇవ్వడంతో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై రవి బిష్ణోయ్ మాట్లాడుతూ.. రాహుల్ తెవాటియా వికెట్ తీసుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పాడు. తెవాటియా క్రీజులో ఉంటే మ్యాచ్ గుజరాత్ వైపే వెళ్లేదని అభిప్రాయపడ్డాడు. సరైన సమయంలో అవుట్ చేయడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారిందంటూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న సమయంలో చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 55, వైభవ్ సూర్యవంశీ 31, ధృవ్ జురేల్ 75 పరుగులు చేశారు. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, కుమార కుశాగ్ర మంచి ఆరంభం ఇచ్చారు. కుశాగ్ర 18 పరుగులే చేసినప్పటికీ ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ 73 పరుగులు చేసినా మిడిలార్డర్ కుప్పకూలడంతో గుజరాత్ 20 ఓవర్లలో 204/8 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయింది.