ఉప్పల్ స్టేడియం వేదికగా - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఆఖరి ఓవర్‌ వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. లో టార్గెట్ మ్యాచ్ అయినప్పటికీ సన్‌రైజర్స్ బౌలర్లు పోరాడటంతో ఆఖరి ఓవర్ వరకూ పోటీ నెలకొంది. అయితే, లాస్ట్ ఓవర్‌లో రిషభ్ పంత్ కొట్టిన విన్నింగ్ షాట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి 9 పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజులో రిషభ్ పంత్, ముకుల్ చౌదరి ఉన్నారు. జయదేవ్ ఉనద్కత్ వేసిన తొలి బంతిని పంత్ ఫోర్ బాదాడు, రెండో బంతి కూడా బౌండరీ వచ్చింది. స్కోర్స్ ఈక్వల్ కావడంతో ఇంకో నాలుగు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే కావాల్సి వచ్చింది. మూడు, నాలుగు బంతులు డాట్స్ కాగా.. ఐదో బంతిని పంత్ బౌండరీగా మలిచాడు. దాంతో లక్నో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పంత్ కొట్టిన ఫోర్ బౌండరీ లైన్ తాకకముందే డగౌట్‌లో ఉన్న లక్నో నెక్స్ట్ బ్యాటర్ అవేశ్ ఖాన్ దాన్ని బ్యాట్‌తో కొట్టాడు. అంటే, అది బౌండరీ వెళ్లలేదు. కానీ దీన్ని ఎవ్వరూ గమనించకపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచినట్టు నిర్థారించారు. ఐసీసీ రూల్ బుక్ ప్రకారం డగౌట్‌లో కూర్చున్న ఏ ఒక్కరూ కూడా.. బౌండరీ దాటకముందే బంతిని పట్టుకోకూడదు. అలా చేస్తే దాన్ని అన్‌‌ఫెయిర్ ప్లే అంటారు. ఒకవేళ ఎవరైనా అలా బాల్‌ని బౌండరీ ముందే పట్టుకుంటే.. రూల్ బుక్‌లో 20.1 లా ప్రకారం అంపైర్ దాన్ని డెడ్ బాల్‌గా ప్రకటించొచ్చు. 41 లా ప్రకారం అన్‌ఫెయిర్ ప్లే అని కూడా నిర్థారించొచ్చు. దాంతో పాటు ఐదు పెనాల్టీ రన్స్ కూడా వస్తాయి. ఈ లెక్క ప్రకారం అవేశ్ ఖాన్ బౌండరీ దాటక ముందే తన బ్యాట్‌తో బంతిని కొట్టాడు. అంటే ఇప్పుడు ఆ బంతి డెడ్ బాల్ అవడంతో పాటు ఐదు అదనపు పరుగులు కూడా సన్‌రైజర్స్‌కు వస్తాయి. దాంతో లక్నో ఆఖరి రెండు బంతులకు ఆరు పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్ తరఫు వాళ్లు దీన్ని గమనించి ఉంటే ఎస్ఆర్‌హెచ్ గెలిచే అవకాశాలు ఉండుండేవి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన రిషభ్ పంత్ సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించి తక్కువ పరుగులకే కట్టడి చేశాడు. సన్‌రైజర్స్ మాజీ బౌలర్ మొహమ్మద్ షమీ దెబ్బకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ను ప్రిన్స్ యాదవ్ అవుట్ చేయడంతో కేవలం 11 పరుగులకే సన్‌రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే లివింగ్‌స్టోన్ కూడా అవుటవ్వడంతో 7.1 ఓవర్లలో కేవలం 24 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. నితీష్ కుమార్ రెడ్డి - హెన్రిచ్ క్లాసెన్ కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. క్లాసెన్ 62, నితీష్ కుమార్ రెడ్డి 56 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 156/9 చేసింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో.. ఎయిడెన్ మార్కరమ్ 45, రిషభ్ పంత్ 68 రాణించడంతో 19.5 ఓవర్లలో 160/5 చేసి విజయం సాధించింది.