‘నా భర్తకు 40 ఏళ్లు, నాకు 19 ఏళ్లు.. ప్రియుడితోనే కలిసి బతుకుతా’.. యువతి వాదన, హైకోర్టు సంచలన తీర్పు..!

Wait 5 sec.

‘‘నా భర్తతో కలిసి బతకలేను, నా వయసు కంటే మా ఇద్దరి మధ్య ఉన్న వయసు అంతరం ఎక్కువ. ఆయన నన్ను సరిగా చూసుకోవడం లేదు. అలాగనీ నా తల్లిదండ్రుల దగ్గరకు కూడా వెళ్లను. నేను నా ప్రియుడితోనే కలిసి జీవిస్తాను’’ అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన 19 ఏళ్ల వివాహితకు బాసటగా నిలిచింది. స్వతంత్రంగా, ఆమెకు నచ్చిన వ్యక్తితో కలిసి బతికేందుకు గ్వాలియర్ బెంచ్ చట్టబద్ధమైన అనుమతి ఇచ్చింది. ఆమె ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చిన న్యాయస్థానం.. ఆరు నెలలపాటు ఆమెను ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది.నా భార్యను ఓ యువకుడు బలవంతంగా బంధించి ఉంచాడని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్‌లో ఇటీవల హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టుకు హాజరైన వివాహిత.. తన భర్త, తల్లిదండ్రులు, ప్రస్తుతం తాను కలిసి ఉంటున్న వ్యక్తి సమక్షంలో న్యాయమూర్తుల ముందు కీలక వ్యాఖ్యలు చేసింది. తాను కోరుకుంటున్న స్వేచ్ఛ ప్రస్తుతం తాను కలిసి ఉంటున్న వ్యక్తే ఇస్తున్నాడని ఆమె స్పష్టం చేసింది. తన క్షేమం దృష్ట్యా.. భర్త లేదా తల్లిదండ్రులకు తిరిగి వెళ్లే ప్రసక్తి లేదని ఆమె కోర్టుకు స్పష్టం చేసింది.మరి ఎక్కడ బతకాలని అనుకుంటున్నావ్ అని న్యాయమూర్తులు అడగ్గా.. తనను బంధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితోనే కలిసి ఉండాలని అనుకుంటున్నట్లు ఆమె సమాధానం ఇచ్చింది. ఆ యువతితో ప్రైవేట్‌గా మాట్లాడి, ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అంజలి జ్ఞానానిని కోర్టు ఆదేశించింది. కౌన్సెలింగ్ అనంతరం అంజలి జ్ఞానాని న్యాయమూర్తులతో మాట్లాడుతూ.. ‘ఆ యువతి తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. తనకంటే చాలా పెద్దవాడైన వ్యక్తితో వివాహ బంధంలో ప్రశాంతత కంటే ఇబ్బందులే ఎక్కువగా అనుభవించానని.. అందుకే ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలని నిశ్చయించుకుంది’ అని తెలిపారు.ఆమెను పెళ్లాడతానన్న యువకుడు..దీంతో న్యాయస్థానం.. మరి నీ అభిప్రాయం ఏంటని ఆమెతో కలిసి ఉంటున్న యువకుణ్ని ప్రశ్నించింది. దీనికి ఆ యువకుడు స్పందిస్తూ.. ఆమె అంటే తనకు ఇష్టమని.. ఆమెకు విడాకులు వచ్చాక ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు. ఆమెను బాగా చూసుకుంటానని.. ఏ రకం గానూ వేధింపులకు గురి చేయనంటూ అతడు కోర్టుకు హామీ పత్రం ఇచ్చాడు.ఆమె మేజర్ కావడంతోపాటు.. తన ఇష్టంతో నిర్ణయం తీసుకుందని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అందువల్ల ఆమె భర్త దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ అవసరం ఇక లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే, తన భర్తతో కాకుండా ఆమె మరో వ్యక్తితో కలిసి బతకడానికి అనుమతించడానికి ముందు.. ఆమెను ఆరు నెలలపాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ‘శౌర్య దీదీ’ పర్యవేక్షణలో ఉంచాలని జస్టిస్ ఆనంద్ పాఠక్, జస్టిస్ పుష్పేంద్ర యాదవ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. శౌర్య దీదీలుగా నియామకం..ప్రభుత్వ న్యాయవాది అంజలి జ్ఞానానితోపాటు ఆ మహిళను కోర్టులో హాజరుపర్చిన కానిస్టేబుల్ భావనను శౌర్య దీదీలుగా న్యాయస్థానం నియమించింది. 2024లో హర్‌చంద్ గుర్జర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ కేసు సందర్భంగా ‘శౌర్య దీదీ’కి గ్వాలియర్ బెంచ్ రూపకల్పన చేసింది. దీని ప్రకారం.. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు మార్గదర్శనం చేయడానికి, వారికి అండగా నిలవడానికి.. పోలీసు అధికారిణిని లేదా జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద అర్హతలున్న వ్యక్తిని శౌర్య దీదీగా నియమిస్తారు. ముఖ్యంగా లైంగిక బాధితులు, సంరక్షణ అవసరమైన బాలికలు, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనర్ల కోసం ఈ వ్యవస్థ పని చేస్తుంది.