28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్.. ఎవరూ షేర్ చేయొద్దు.. అసలు సంగతి చెప్పిన APSDMA

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు జిల్లాలను కూడా కలుపుకుని మొత్తం 28 జిల్లాలతో కొత్త మ్యాప్ ఒకటి విడుదలైందంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ఈ నెల 2వ తేదీన ఈ మ్యాప్‌ను విడుదల చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మ్యాప్‌కు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. సోషల్ మీడియాలో, వీడియోలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్వయంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. '28 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ నూతన మ్యాప్‌ను రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిందని పేర్కొంటూ మీడియాలో, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారంలో ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ దృష్టికి వచ్చింది. ఏపీఎస్డీఎంఏ తరఫున అటువంటి మ్యాప్ ఏదీ జారీ చేయబడలేదని లేదా విడుదల చేయబడలేదని స్పష్టం చేయడమైనది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఆ సమాచారం అవాస్తవం, తప్పుదోవ పట్టించేది, అనధికారికమైనదని తెలియజేసింది. #APSDMA పేరుతో, లోగోతో షేర్ చేయబడుతున్న ఆ మ్యాప్ ప్రామాణికమైనది కాదు. ప్రజలు, మీడియా సంస్థలు, సంబంధిత వర్గాలందు ఇటువంటి ధృవీకరించని సమాచారాన్ని షేర్ చేయవద్దని, దానిని విశ్వసించవద్దని సూచించడమైనది. విపత్తుల సంస్థ జారీ చేసే అధికారిక సమాచారాన్ని, ప్రచురణలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరడమైనది' అంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ట్వీట్ చేసింది. ఏపీలో గతంలో 26 జిల్లాలు ఉండగా.. ఇటీవల మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ రెండు జిల్లాలను కలిపి 28 జిల్లాలతో కొత్త మ్యాప్ విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మ్యాప్‌లో రాజధాని ప్రస్తావన కూడా ఉందని.. కొత్తగా ఏర్పడిన జిల్లాల సరిహద్దులను స్పష్టంగా పొందుపరిచారంటూ జోరుగా ప్రచారం చేశారు. గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో సరిహద్దుల మధ్య అమరావతి ఉన్నట్లుగా మ్యాప్‌లో పొందుపరిచినట్లుగా మ్యాప్‌లోని అంశాలను ప్రస్తావించారు. అయతే ఇదంతా ఫేక్ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తేల్చి చెప్పింది. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు.మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజల్ని అలర్ట్ చేసింది.. రాష్ట్రంలో ఏపీలో పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.