Food Price: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం అంతర్జాతీయ ఆహార ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముడి చమురు ధరల పెరుగుదల, ఇంధన కొరత ప్రపంచ మార్కెట్లను తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీనిపై ఐక్య రాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే ఆహార ధరలు మరింత పెరగవచ్చని హెచ్చరికలు చేసింది. ఈ మేరకు పెరుగుతున్న ధరలపై ఓ రిపోర్ట్ విడుదల చేసింది. మరి ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. యూఎన్ఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ ఆహార ధరలు గత ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి 2026 నెలలో 2.4 శాతం మేర పెరిగాయి. దీంతో ఫుడ్ ప్రైస్ 128.5 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 1 శాతం మేర అధికమని నివేదిక తెలిపింది. నెల వారీ ప్రాతిపదికన చూసుకుంటే వంట నూనెల ధరలు 5.1 శాతం, చక్కెర ధర 7.2 శాతం వరకు పెరిగాయి. ఇక గోధుమల ధరలు సైతం 4.3 శాతం మేర పెరిగినట్లు నివేదిక తెలిపింది. ధరల పెరుగుదలతో ఎరువులు, మొక్క జొన్న ధరలు భారమయ్యాయి. ఇథనాల్‌కు డిమాండ్ పెరిగింది. యుద్ధం ప్రభావంతో సామాన్యులకు ఊరటనిచ్చేలా బియ్యం ధరలు మాత్రం కాస్త తగ్గడం విశేషం. కానీ, ఇతర నిత్యావసర ధరలు ఒక్కసారిగా పెరగడం సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఆహార ధరలు పెరిగేందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే సరఫరా గొలుసు దెబ్బతిని, ద్రవ్యోల్బణం మరిత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇరాన్ యుద్ధం ఫిబ్రవరి 28, 2026న మొదలైంది. కొద్ది రోజుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఇజ్రాయెల్ మట్టుపెట్టడం, ఇరాన్ వద్ద ఆయుధాలు తగ్గిపోవడం వంటి వార్తలతో యుద్ధం ఓ వారంలోనే ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా ఇరాన్ ప్రతిదాడులు చేపట్టింది. అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, కంపెనీలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. ఇటు హార్ముజ్ జల సంధిని మూసివేసి చమురు సరఫరాను అడ్డుకుంది. దీంతో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. యుద్ధం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని అనిశ్చితితో భారత్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.