ఇరాన్ ఘాటుగా బదులిచ్చింది. హోర్ముజ్ జలసంధిని బేషరతుగా తెరవడానికి టెహ్రాన్ నాయకత్వం అంగీకరించలేదు. దీంతో గల్ఫ్‌ ప్రాంతంలో యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ హతమయ్యారు. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ ప్రకటించినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. సోమవారం ఉదయం జరిగిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో ఖదేమీ చనిపోయినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించినట్లు తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన జారీ చేసింది. అయితే ఈ దాడుల విషయమై ఇజ్రాయెల్ వెంటనే స్పందించలేదు. ‘‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్‌ అధిపతి.. విద్యావంతుడు, శక్తివంతుడైన మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ.. నేడు (సోమవారం) తెల్లవారుజామున అమెరికన్-జియోనిస్టు శత్రువుల నేరపూరిత ఉగ్రదాడిలో వీరమరణం పొందారు’’ అని అని ఐఆర్‌జీసీ తమ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్టు చేసింది.ఐఆర్‌జీసీ చీఫ్ నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్‌కు రిపోర్టు చేస్తారు. సుమారు 50 ఏళ్లపాటు సేవలు అందిచిన ఖదేమీ.. గూఢచర్యం, సెక్యూరిటీ సర్వీసుల్లో కీలక పాత్ర పోషించారు. ఖదేమీ మరణం ఐఆర్‌జీసీ వ్యూహాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. గత నెలలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ సైతం ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరిట ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్, అమెరికా.. . ఐఆర్‌జీసీ చీఫ్ మహ్మద్ పక్‌పౌర్, బసిజ్ ఫోర్స్ చీఫ్ ఘోలంరెజా సోలెమనీ, రక్షణ మంత్రి అజిజ్ నసిర్‌జాదేహ్‌ తదితరులు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని సైతం హతమారుస్తామని ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు ప్రకటించాయి. సోమవారం ఉదయం ఇరాన్‌లోని ఎస్లాంషార్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎస్లాంషార్ పట్టణం రాజధాని టెహ్రాన్‌కు నైరుతి దిశలో ఉంటుంది. సోమవారం ఉదయం ఈ పట్టణంలోని నివాస భవనంపై వైమానిక దాడులు జరిగాయి.