చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ సృష్టించిన విధ్వంసం ఇప్పటికీ మైండ్‌లో నుంచి పోవడం లేదు. - రజత్ పటిదార్ ఆఖరి ఐదు ఓవర్లలో ఆడిన సునామీ ఇన్నింగ్స్‌కి స్టేడియం మొత్తం ఎరుపెక్కిపోయింది. స్టేడియం బయటకు వెళ్లిన ఓ సిక్స్ టిమ్ డేవిడ్ ఊతకోతకు నిదర్శనంగా నిలిచింది. క్రీజులో అడుగుపెట్టింది మొదలు ఆఖరి బంతి వరకూ బంతి బౌండరీని తాకుతూనే ఉంది. ఆర్సీబీ చరిత్రలోనే సీఎస్కేపై హైయెస్ట్ స్కోర్ నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఐపీఎల్ 2026లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఓ మినీ యుద్ధమే సాగిందా అనిపించింది. ఆఖరి ఐదు ఓవర్లలో ఆర్సీబీ బ్యాటింగ్‌కి స్టేడియం మొత్తం దద్దరిల్లింది. టిమ్ డేవిడ్, కెప్టెన్ రజత్ పటిదార్ ధాటికి బంతి కూడా అలసిపోయిందా అనిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఓవర్ మొత్తం బౌండరీలు బాదుతూనే ఉన్నారు. ఆఖరి ఐదు ఓవర్లలో ఆర్సీబీ ఏకంగా 97 పరుగులు నమోదు చేసింది. అంటే ప్రతి బంతీ దాదాపు బౌండరీ వెళ్లినట్టే. అందులో టిమ్ డేవిడ్ 25 బంతుల్లోనే 70 పరుగులు నమోదు చేయడం విశేషం. మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 280 స్ట్రయిక్ రేట్‌తో చిన్నస్వామిలో విధ్వంసం సృష్టించాడు. టిమ్ డేవిడ్‌తో పాటు కెప్టెన్ రజత్ పటిదార్ కూడా చిక్కిన చిక్కినట్టు బౌండరీ బాదాడు. ఈ ఇద్దరూ ఆఖరి వికెట్‌కు 35 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ అంటే ఏంటో నిరూపించింది. పవర్ ప్లేలో పెద్దగా రాణించలేకపోయినా.. ఓపెనర్లు ఇద్దరూ అవుటైన తర్వాత తమ అసలు హిట్టింగ్‌ను బయటపెట్టింది. దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్ సిక్సర్ల వర్షం కురిపించారు. దాంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. సాల్ట్ 46, కోహ్లి 28, దేవదత్ పడిక్కల్ 50, పటిదార్ 48, టిమ్ డేవిడ్ 70 పరుగులు చేశారు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మళ్లీ నిరాశ పరిచింది. ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ అదే బ్యాటింగ్‌తో వికెట్లు పోగొట్టుకున్నారు. ఆయుష్ మాత్రే కూడా వెంటనే అవుటవ్వడంతో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. సర్ఫరాజ్ ఖాన్ 50, ప్రశాంత్ వీర్ 43, జెమీ ఓవర్టన్ 37 పరుగులతో పోరాడినప్పటికీ 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.