ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతోన్న యుద్ధం నెక్స్ట్ లెవల్‌కు వెళ్లే సూచనలు కనిపిస్తు్న్నాయి. విషయంలో ఇరుదేశాలు పంతానికి పోతున్నాయి. ఈ జలసంధిని తెరవడానికి గడువు దగ్గరపడుతోందని.. ఆ టైంలోగా తెరవకపోతే మీ అంతు చూస్తామని ఓవైపు ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇరాన్ సైతం తగ్గేదేలే అన్నట్టుగా బదులిస్తుంది. అమెరికా బెదిరింపులను టెహ్రాన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో గల్ఫ్ యుద్ధం తారా స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.హోర్మూజ్ జలసంధిని తెరవకపోతే మంగళవారం ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులో బూతులతో ఆయన రెచ్చిపోయారు. ట్రంప్ హెచ్చరికల పట్ల ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ ఘలిబఫ్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అలాంటి చర్యలు తీసుకుంటే.. అమెరికాతోపాటు పశ్చిమాసియా దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఘలిబఫ్ హెచ్చరించారు. ట్రంప్ ఉద్రిక్తతలు పెంచుతున్నారని.. అస్థిరతలోకి నెట్టేస్తున్నారని.. ఆయన నిర్లక్ష్యంగా అడుగులేస్తున్నారని.. ఇవన్నీ కలిసి అమెరికా పరిస్థితి నరకంలా మారుతోందని ఘలిబఫ్ ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆరోపించారు.ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగానే పశ్చిమాసియాలో అమెరికా చర్యలు ఉటున్నాయని.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాటలు విని గల్ఫ్ ప్రాంతాన్ని ట్రంప్ తగలబెడుతున్నారని ఘలిబఫ్ మండిపడ్డారు. యుద్ధ నేరాల ద్వారా ట్రంప్ సాధించేది ఏమీ లేదని.. ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించి.. ప్రమాదకరమైన యుద్ధాన్ని ముగించడమే ఈ సమస్యు ఏకైక పరిష్కారమని ఇరాన్ నేత తన పోస్టులో పేర్కొన్నారు.హోర్ముజ్ తెరవడానికి ఇరాన్ కొత్త షరతు..హోర్ముజ్‌ను తిరిగి తెరవడానికి టెహ్రాన్ ఓ కొత్త షరతును విధించింది. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారంగా.. హోర్ముజ్ మార్గం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఇరాన్‌‌కు కేటాయిస్తేనే.. ఈ జలసంధి గుండా రవాణాకు అనుమతి ఇస్తామని ఇరాన్ అధ్యక్షుడి అధికార ప్రతినిధి సయ్యద్ మహ్మద్ మెహదీ తబాతబెయ్ స్పష్టం చేశారు. ఆ జలసంధిని కూడా టార్గెట్ చేస్తాం..అమెరికా మూర్ఖంగా మళ్లీ అవే తప్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లయితే.. ప్రపంచదేశాలకు వెళ్లే చమురు, గ్యాస్ సరఫరాను.. వాణిజ్యాన్ని ఒకే ఒక సిగ్నల్‌తో స్తంభింపజేయవచ్చని వారు గ్రహిస్తారు అని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి విదేశాంగ సలహాదారుగా పని చేసిన అలీ అక్బర్ వెలాయటి హెచ్చరించారు. తమ రెసిస్టెంట్ ఫ్రంట్ ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మాండేబ్ జలసంధిని టార్గెట్ చేయొచ్చని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి ద్వారా జరుగుతోంది. గతంలో ఈ జలసంధిని యెమెన్‌లోని ఇరాన్‌ అనుకూల హౌతీ బలగాలు టార్గెట్ చేశాయి. ఇప్పటికే హోర్ముజ్ గుండా రవాణా దాదాపుగా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. బాబ్ ఎల్ మాండేబ్ ద్వారా నౌకల రాకపోకలు కూడా నిలిచిపోతే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై మరింత తీవ్రంగా ఉంటుంది.