బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ - సీఎస్కే మ్యాచ్ ఈ సీజన్‌కే హైలెట్‌గా నిలుస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ల హవా అంతా ఇంతా కాదు. రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ విధ్వంసంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 250 పరుగులు చేసింది. అయితే, ఆర్సీబీ బ్యాటర్లతో పాటు ఓ బౌలర్ కూడా హాట్ టాపిక్ అయ్యాడు. అతడే .. స్పిన్నర్ అయిన కృనాల్.. స్పిన్నర్లు, బౌన్సర్లతో చెలరేగిపోయాడు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే ఆరంభంలో వికెట్లు పడినా పవర్ ప్లేలో 77 పరుగులు రాబట్టింది. సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడి పవర్ ఫ్లేలోనే తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత బంతి అందుకున్న కృనాల్ పాండ్యా తొలి బంతికే సర్ఫరాజ్ ఖాన్‌ను అవుట్ చేశాడు. షాట్ కొట్టేందుకు ముందుకొచ్చిన సర్ఫరాజ్ స్టంప్ అవుటయ్యాడు. ఆ తర్వాత బంతికే క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే సిక్సర్ బాదాడు. సిక్స్ వెళ్లడంతో వెంటనే బౌన్సర్ విసిరాడు. ఆ దెబ్బకు హార్డ్ హిట్టర్ శివమ్ దూబే కూడా భయపడ్డాడు. అదే ఓవర్‌లో కార్తీక్ శర్మ వికెట్ కూడా తీసిన కృనాల్ పాండ్యా.. ఆఖరి బంతికి ప్రశాంత్ వీర్ బ్యాటింగ్ ఆడుతుండగా 126.1 అంటే ఆల్‌మోస్ట్ 130 కేపీహెచ్ వేగంతో బౌన్సర్ వేశాడు. కృనాల్ పాండ్యా బౌన్సర్లు వేయడం, భారీ స్పీడ్‌తో వేయడంతో అసలు స్పిన్ బౌలింగా లేక పేస్ బౌలింగా అన్న కన్ఫ్యూజన్‌లో బ్యాటర్లు పడ్డారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ పక్కనపెడితే ఆర్సీబీ టీమ్ మేట్స్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రజత్ పటిదార్ కూడా కృనాల్ పాండ్యా బౌలింగ్‌కి షాక్ అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన కృనాల్ రెండు వికెట్లు తీసి 36 పరుగులు ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కృనాల్ పాండ్యా కీలక ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టైటిల్ సాధించడంలో కృనాల్ కీలక పాత్ర పోషించాడు.