ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో మౌలిక వసతుల్ని మరింత మెరుగుపరిచేందుకు సిద్ధమైంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. ఈ క్రమంలో తిరుపతిలో మరిన్ని మౌలిక వసుతల్ని కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించింది. తిరుపతిలో ప్రస్తుతం ఉన్న మెయిన్ బస్టాండ్ స్థానంలో కొత్తగా ఇంటర్‌ మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మించాలని నిర్ణయం తీసుకోగా.. తాజాగా దీనికి సంబంధించి కీలక ముందడుగు వేసింది. తిరుపతి ఇంటర్‌ మోడల్‌ బస్‌ టెర్మినల్‌‌కు ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌) విధానంలో నిర్మించాలని తేల్చారు. తిరుపతిలో ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్టాండ్‌ స్థలంలో.. ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌ (నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌) బస్‌ టెర్మినల్‌‌ను రూ.470 కోట్ల అంచనాతో ప్లాన్ చేశారు. ఈ టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి మూడు విధానాలను (బీవోటీ, హామ్, ఈపీసీ) అధ్యయనం చేశారు. వాటిలో ఈపీసీ బావుంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనల్ని కూడా పంపారు. తిరుపతి బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్, తిరుమల, ఆ చుట్టుపక్కల ఉన్న ఆలయాలకు వెళ్లే భక్తులకు ఈ టెర్మినల్ కీలకంగా మారింది.. అందుకే దీనికి ఇంటర్‌ మోడల్‌‌గా పేరు పెట్టారు. ఇంటర్‌ మోడల్‌ బస్‌ టెర్మినల్‌ డీపీఆర్ తయారు చేసేందుకు రైట్స్ (రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌)ను సలహా సంస్థగా నియమించారు. ప్రస్తుతం ఉన్న తిరుపతి బస్టాండ్, డిపో కలిపి మొత్తం 13.18 ఎకరాల్లో ఉంది. ఇందులో 7.11 ఎకరాల్లో ఈ బస్ టెర్మినల్ ప్లాన్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న 4.29 ఎకరాలను కమర్షియల్‌గా అభివృద్ధి చేయనున్నారు.99 సెంట్ల భూమిని రోడ్డు కోసం, 79 సెంట్ల భూవిని ఫ్లై ఓవర్ కోసం నిర్మించనున్నారు. బస్ టెర్మినల్‌లో పార్కింగ్ కోసం సెల్లార్‌లో రెండు అంతస్తులు ప్లాన్ చేశారు. ఇలా ఆయ సదుపాయాల కోసం భూమిని కేటాయించారు. ప్రస్తుత ప్లాన్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం టెర్మినల్‌కు కేటాయిస్తారు. మొత్తం 98 ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం.. టెర్మినల్ ప్రాంగణంలో మరో 50 బస్సులు నిలిపేందుకు వీలుగా స్థలం కేటాయించనున్నారు.టెర్మినల్ గ్రౌండ్‌ ఫ్లోర్‌ పైన 10 అంతస్తులు నిర్మించి కమర్షియల్‌ (హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలకు, మిగిలిన షాపులకు) కేటాయిస్తారు. అంతేకాదు టెర్మినల్‌లోని పదో ఫ్లోర్‌లో హెలీప్యాడ్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ టెర్మినల్ నుంచి బస్టాండ్, రైల్వే స్టేషన్‌ను కనెక్ట్ చేసేందుకు ఫుట్ ఓవర్ బ్రడ్జి నిర్మించనున్నారు. ఇటీవల అధికారులు ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నవారితో అధికారులు మాట్లాడారు.. వారి నుంచి అభిప్రాయాలసేకరించి పభుత్వానికి నివేదిక పంపించనున్నారు. కమర్షియల్‌గా కేటాయించబోయే వాటితో లాభాల పరిస్థితి.. ఆర్టీసీకి ఎంత ఇస్తారు, ఒప్పందం ఎన్నేళ్లు అనే అంశాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ను మరో చోటికి తరలిస్తే 5 ఎకరాల భూమి, డిపో కోసం మరో ఐదు ఎకరాలు తాత్కాలికంగా కేటాయించాలని ఆర్టీసీ జిల్లా కలెక్టర్‌ను కోరింది.