ఫేస్‌బుక్‌‌లో మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్.. రూ.2.36 కోట్లు మోసపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Wait 5 sec.

రోజురోజుకూ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నప్పటికీ.. కొంతమందికి మాత్రం అవి పట్టడం లేదు. పోలీసులు, ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు, సెలబ్రిటీలు.. సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. జనం గుడ్డిగా నమ్మి మోసాల పాలవుతున్నారు. మరోవైపు.. రోజురోజుకూ కొత్త కొత్త తరహా మోసాలతో సైబర్ కేటుగాళ్లు కూడా నేరాల్లో ఆరితేరిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఫేస్‌బుక్‌లో మహిళ పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ కారణంగా భారీగా డబ్బులు కోల్పోయి.. ఇప్పుడు తల పట్టుకున్నాడు. మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలను నమ్మిన ఆ టెకీ.. ఏకంగా రూ.2.36 కోట్లు సమర్పించుకున్నాడు.హైదరాబాద్‌ కొండాపూర్‌‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వీరభద్రరావుకు.. గతేడాది ఆగస్టు నెలలో ఫేస్‌బుక్‌లో ఒక మహిళ పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత తన పేరు కోరా అని పరిచయం చేసుకున్న మహిళ మాటలు కలిపింది. తనది సింగపూర్‌ అని.. కానీ ప్రస్తుతం ముంబైలో పనిచేస్తున్నట్లు చెప్పింది. కొన్నిరోజులు చాటింగ్‌ చేసుకున్న తర్వాత ఇద్దరూ ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. తన తల్లి ప్రస్తుతం.. సవతి తండ్రితో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు కోరా.. వీరభద్రరావుకు చెప్పింది. అంతేకాకుండా తనకు జర్మనీ సహా చాలా దేశాల్లో ఫ్రెండ్స్ ఉన్నారని నమ్మించి.. ఫేస్‌బుక్‌ గ్రూపులో వీరభద్రరావును యాడ్‌ చేసింది.ఇక ఆ గ్రూపులో ఉన్న వారంతా ఫేస్‌బుక్‌ స్టోర్‌లో పెట్టుబడులు పెడుతున్నారని.. వాటితో భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని వీరభద్రరావును కోరా నమ్మించింది. డబ్బులు ఉంటే ట్రేడింగ్‌ చేయాలని.. దాంతో భారీగా లాభాలు వస్తాయని మెల్లగా బుజ్జగించింది. మొదట వద్దని చెప్పిన వీరభద్రరావు.. ఆ తర్వాత కోరా చెప్పడంతో ఓకే చెప్పేశాడు. దీంతో ఫేస్‌బుక్‌ స్టోర్‌ పేరుతో వీరభద్రరావుకు కోరా ఒక లింక్‌ను పంపించింది. అది ఓపెన్‌ కాకపోవడంతో ఏపీకే ఫైల్‌ను పంపింది. ఆ ఏపీకే ఫైల్‌ను వీరభద్రరావు డౌన్‌లోడ్‌ చేయగానే ఫేస్‌బుక్‌ లాంటి యాప్‌ వచ్చింది. ఆ యాప్‌లోని స్టోర్‌లో వస్తువులు కొనడం, అమ్మడం ద్వారా లాభాలు సంపాదించవచ్చని తెలిపింది. ఏదైనా అనుమానాలు, సలహాల కోసం తన జర్మనీ ఫ్రెండ్ బెల్లాతో మాట్లాడాలని ఫోన్‌ నంబర్‌ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే బెల్లా చెప్పినట్లు చేస్తూ వీరభద్రరావు పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. గతేడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 12వ తేదీ మధ్య క్రిప్టో వ్యాలెట్‌ ద్వారా ఏకంగా రూ.2.36 కోట్లను వీరభద్రరావు పంపించాడు. ఆ యాప్‌లో తనకు కొనుగోళ్లు, అమ్మకాల ద్వారా భారీగా లాభాలు వచ్చినట్లు కనిపించినా.. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు. మొదట్లో ఓపిక పట్టిన వీరభద్రరావు.. గత కొన్ని నెలలుగా ఎన్నిసార్లు అడిగినా లాభం పక్కనపెడితే.. తాను పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో మోసపోయానని వీరభద్రరావు గ్రహించాడు. దీంతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.