తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో మొత్తం 3 టిమ్స్ ఆస్పత్రులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేయగా.. ప్రస్తుతం నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. అల్వాల్, సనత్ నగర్, కొత్తపేట ప్రాంతాల్లో ఈ కొత్త రెడీ అవుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ సందర్భంగా.. సనత్ నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది.ఈ నేపథ్యంలోనే త్వరలో ఓపెన్ కానున్న ఈ టిమ్స్ ఆస్పత్రుల్లో విదేశాల నుంచి వచ్చి చికిత్స తీసుకునేవారికి కూడా వైద్యం అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఒక్కో టిమ్స్ ఆస్పత్రిలో విదేశీయులకు ప్రత్యేకంగా 50 బెడ్లను కేటాయించనున్నారు. ఇందుకోసం విదేశీ ప్రభుత్వాలతో తెలంగాణ ప్రభుత్వం నేరుగా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకోనుంది. కార్పొరేట్ ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా సౌకర్యాలు, వైద్య సేవలను అందిస్తూ.. తక్కువ ఖర్చుతోనే రోగులకు నయం చేసేందుకు సర్కార్ చర్యలు చేపడుతోంది.ఇప్పటికే హైదరాబాద్ నగరం గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌‌గా ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో దాన్ని మరింత పెంచేందుకు ఫారిన్ పేషంట్లను కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న సనత్ నగర్ టిమ్స్‌తో పాటు అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ ఆస్పత్రుల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక ఇంటర్నేషనల్ పేషెంట్ వింగ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటిదాకా ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన విదేశీ వైద్య సేవలు.. ఇక నుంచి ప్రభుత్వ పరిధిలోకి కూడా రానున్నాయి. విదేశాల నుంచి నేరుగా రోగులను రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ టు గవర్నమెంట్ (జీ టు జీ) ఒప్పందాలు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా ఆఫ్రికా, అరబ్ దేశాల నుంచి ఎక్కువగా రోగులు.. చికిత్స కోసం హైదరాబాద్‌ నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలతో నేరుగా ఎంఓయూలు చేసుకోవడం ద్వారా విదేశీ పేషంట్లను టిమ్స్ ఆస్పత్రులకు రప్పించాలని ప్రణాళికలు తయారు చేస్తోంది. మెడికల్ టూరిజాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా నాలుగు టిమ్స్ ఆస్పత్రుల్లో ఒక్కో చోట 50 బెడ్ల చొప్పున మొత్తం 150 పడకలను కేవలం విదేశీయులకే కేటాయించనున్నారు.ప్రస్తుతం వివిధ దేశాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగులు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు ఎక్కువగా వెళ్తున్నారు. అయితే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌కు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ ఆస్పత్రులకు మించి.. అతి తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అవయవాల మార్పిడి, గుండె ఆపరేషన్లు, క్యాన్సర్ వంటి తీవ్రమైన, క్లిష్టమైన రోగాలకు కూడా టిమ్స్‌ ఆస్పత్రుల్లో అంతర్జాతీయ స్థాయి చికిత్సను అందించనున్నారు.