: అంతర్జాతీయంగా కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. . క్రూడాయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. భారత్‌లో కూడా వంట గ్యాస్ ధరల్ని చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచగా.. తర్వాత ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. యుద్ధం నేపథ్యంలో దిగుమతులు తగ్గడంతో.. కొరత ఏర్పడింది. గతంలో కంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు లేదా రీఫిల్ సమయాన్ని కేంద్రం పొడిగించింది. దీంతో గ్యాస్ కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చాలా మందికి బుకింగ్ చేసిన 15 రోజులు దాటితే గానీ గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చే పరిస్థితులు లేవు. ఈ క్రమంలోనే ఇప్పుడు భారతదేశంలో చిన్న గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. 5 కిలోల చిన్న గ్యాస్ సిలిండర్లను జనం విపరీతంగా కొంటున్నట్లు తెలుస్తోంది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దాదాపు 6.6 లక్షల ఈ అమ్ముడుబోయినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ చిన్న గ్యాస్ సిలిండర్లనే ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లుగా (FTL) పిలుస్తుంటారు. సాధారణ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల మాదిరిగా వీటికి ప్రత్యేకంగా బుకింగ్ అవసరం లేదు. అడ్రస్ ప్రూఫ్ అంతకన్నా అవసరం ఉండదు. చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల్ని చూపించడం ద్వారా సమీపంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు లేదా దగ్గర్లోని కన్వీనియెన్స్ సెంటర్ల దగ్గర తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ దందాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని.. మార్చి నుంచి సుమారు 50 వేలకుపైగా దాచి ఉంచిన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. 'ఏప్రిల్ నాలుగో తేదీన దేశవ్యాప్తంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు 90 వేలు అమ్ముడయ్యాయి. మార్చి 23 నుంచి చూస్తే ఇప్పటివరకు మొత్తంగా సుమారు 6.6 లక్షల సిలిండర్లు సేల్ అయ్యాయి.' అని ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదని.. ఒక్కరోజులోనే 51 లక్షల సిలిండర్లు డెలివరీ చేసినట్లు వెల్లడించింది. గృహ వినియోగానికి వాడే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌కు ఉజ్వల యోజన కింద కొంత సబ్సిడీ వస్తుండగా.. 5 కిలోల గ్యాస్ సిలిండర్‌ను మాత్రం మార్కెట్ ధరకే విక్రయిస్తుంటారు. దీనికి నివాస ధ్రువీకరణ అవసరం లేదు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరే తీసుకోవచ్చు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ. 965 గా ఉండగా.. 5 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 500 కుపైగానే పలుకుతోంది.