తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. వీకెండ్, పండగలు, వేసవికాలంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరుగుతోంది. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఏకంగా 18 నుంచి 24 గంటల సమయం పట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది. భక్తుల కోసం క్యూలైన్లలో వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ముందుగా ఈ వీఆర్ టెక్నాలజీని క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్‌లలో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వర్చువల్ రియాలటీ ద్వారా క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులు ఆధ్యాత్మికత వైపు మళ్లించేలా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్చువల్ రియాలిటీ విధానంలో తిరుమల శ్రీవారి వైభవంతో పాటుగా తిరుమల క్షేత్ర విశేషాలు భక్తులకు తెలియజేసేలా టీటీడీ రూపకల్పన చేస్తోంది. వీఆర్‌ హెడ్‌సెట్ల ద్వారా భక్తులు సరికొత్త అనుభూతిని పొందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఈ వీఆర్ ప్రాజెక్టును డొనేషన్ విధానంలో చేపట్టనున్నారు.. ప్రస్తుతం ఈ వీఆర్‌కు అవసరమైన పరికరాల పనితీరును టీటీడీ పరిశీలిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం నాణ్యమైన పరికరాలను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ వర్చువల్ రియాలిటీ ప్రాజెక్టుకు ఆమోదం రాగానే భక్తులు క్యూలైన్లలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు.వాస్తవానికి ప్రస్తుతం క్యూలైన్‌లలోని కంపార్ట్‌మెంట్లలో టీవీలు అందుబాటులో ఉన్నాయి. కానీ అంతమంది భక్తుల మధ్య ఆ టీవీ సౌండ్ పెద్దగా వినపడదనే చెప్పాలి. అందుకే టీటీడీ ఇలా వర్చువల్ రియాలిటీ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించే భక్తుల కోసం ఈ సరికొత్త విధానాన్ని ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. టీటీడీ ఇప్పటికే తిరుమలలోని క్యూలైన్లు, భక్తుల రద్దీని పరిశీలించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తిరుమలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది టీటీడీ.