‘‘భూపాలపల్లి జిల్లా రద్దు కాదు.. 2027 మార్చి తర్వాతే జిల్లాల మార్పులు చేయగలం’’: రేవంత్ రెడ్డి

Wait 5 sec.

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రస్తుతం ఉన్న జిల్లాల రద్దు.. జిల్లాల సరిహద్దులను మార్చడం గురించి.. గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏర్పాటు చేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం.. జిల్లాల రద్దు, ఏర్పాటు, సరిహద్దుల మార్పుకు సంబంధించి.. తాము ఎలాంటి ఆలోచన చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో జనగణన జరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి మార్పులు విధించవద్దని కేంద్రం సూచించిందని.. అప్పటివరకు ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. ఇక కేంద్రం విధించిన గడువు ముగిసిన తర్వాత జిల్లాల విభజన కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు జ్యుడీషియల్ కమిషన్ వేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, సరిహద్దుల మార్పు, కొత్త జిల్లాలు, పాత జిల్లాల రద్దుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తుందని.. విషపు, అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ఏ జిల్లాలను తొలగించడం గానీ, కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని వెల్లడించారు. ఎప్పుడైనా జిల్లాలను పునర్‌వ్యవస్థీకరణ చేయాలంటే.. బహిరంగంగా ప్రజలకు చెప్పి.. అసెంబ్లీలో చర్చ జరిపి.. ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని అపోహలు సృష్టించినా.. భూపాలపల్లి జిల్లా ప్రజలు చైతన్యవంతులు అని.. వారు అవేమీ నమ్మరని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదని.. కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. 2027 మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రాల్లోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులను మార్చకూడదని కేంద్ర ప్రభుత్వం గడువు విధించిందని పేర్కొన్న సీఎం.. ఆ గడువు ముగిసిన వెంటనే జ్యుడిషియల్‌ కమిషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఆ జ్యుడిషియల్ కమిషన్ ద్వారా.. జిల్లాల సరిహద్దులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.తెలంగాణ ఏర్పాటు సమయంలో రాష్ట్రంలో పది జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అయితే పాలనా సౌలభ్యం పేరిట నాటి కేసీఆర్ సర్కారు 2016 అక్టోబర్‌లో 10 జిల్లాలను విభజించి కొత్తగా మరో 21 జిల్లాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రజల డిమాండ్లు, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కి చేరింది. అయితే జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగకపోవడంతో అధికార యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.