2018లో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఒక బ్యాంక్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం చికిత్స పొందుతుండగా.. అతడి కాలును డాక్టర్లు తొలిగించారు. ఈ నేపథ్యంలోనే ఈ బస్సు ప్రమాదం కారణంగా.. తాను శాశ్వతంగా వైకల్యానికి గురి కావడమే కాకుండా ఉద్యోగం కూడా కోల్పోయానని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. బాధితుడికి పరిహారం చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. పరిహారం, ఖర్చులు, అతడికి ఆదాయ నష్టాన్ని పరిగణలోకి తీసుకుని.. దాదాపు రూ.89 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ కొత్తపేట ప్రాంతంలో నివసించే సీహెచ్ మహేశ్వరరావు.. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. ఈ క్రమంలోనే 2018 అక్టోబర్ 31వ తేదీన.. చెన్నూరు నుంచి నీల్వాయికి తన ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై సీహెచ్ మహేశ్వరరావు ప్రయాణించాడు. ఆ సమయంలోనే అటుగా వస్తున్న AP 28 Z 1049 నంబరుతో ఉన్న ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ప్రమాదంలో మహేశ్వరరావు కాలు తీవ్రంగా దెబ్బతినడంతో.. దాన్ని తొలగించాలని.. డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ చేసి.. మహేశ్వరరావు ఎడమ కాలును తీసేశారు. ఈ క్రమంలోనే తనకు పరిహారం ఇప్పించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును మహేశ్వరరావు ఆశ్రయించారు. బస్సు ఢీకొన్న ఘటనలో తన కాలును తొలగించడంతోపాటు.. ఉద్యోగం కూడా కోల్పోయానని.. ఇప్పుడు తనకు ఎలాంటి ఆదాయం గానీ, ఆధారం గానీ లేవని వేడుకున్నాడు. మహేశ్వరరావు పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రైబ్యునల్‌.. మెడికల్ ఖర్చులు, ఆదాయ నష్టం, సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని మహేశ్వరరావుకు రూ.88,94,658 చెల్లించాలని టీజీఎస్ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో కేసు నమోదు చేసిన తేదీ నుంచి తీర్పు అమలు చేసే వరకు ఉన్న కాలానికి.. 9 శాతం వడ్డీని కూడా కలిపి ఇవ్వాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది.గత నెలలో కూడా బస్సు ప్రమాదంలో కాలు కోల్పోయిన బాలికకు రూ.24.86 లక్షల పరిహారం ఇవ్వాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. 2020 ఆగస్ట్ 4వ తేదీన సైదాబాద్‌ ప్రాంతానికి చెందిన 6 ఏళ్ల హర్షిత తన తల్లిదండ్రులతో కలిసి బోగారం నుంచి నేలపట్ల వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. రామన్నపేట వద్ద వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు టైరు.. హర్షిత కుడికాలు మీది నుంచి వెళ్లడంతో మోకాలి కింది వరకు కాలును డాక్టర్లు తొలగించారు. బస్సు డ్రైవర్‌పై రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. అతడు నేరాన్ని అంగీకరించాడు. బస్ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పేర్కొంటూ.. కోర్టు తీర్పు ఇచ్చింది.