సమాజంలో నేరాలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా బాధ్యతాయుతమైన పౌరుడిగా స్పందిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా నివారించవచ్చని మహ్మద్ ఫిరోజ్ అనే యువకుడు నిరూపించారు. హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతంలో ఒక ఎనిమిదేళ్ల పాఠశాల విద్యార్థినిని ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి వేధిస్తుండగా.. తన ప్రాణాలకు తెగించి ఆ చిన్నారిని రక్షించాడు. మనకెందుకులే అని వదిలేయకుండా చిన్నారిని కాపాడిన ఫిరోజ్‌ను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు.ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఈ నెల 1న అబిడ్స్ ప్రాంతంలో స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న 8 ఏళ్ల బాలికను మెహదీపట్నంకు చెందిన ఆటో డ్రైవర్ సలీం మాయమాటలు చెప్పి ఎక్కించుకున్నాడు. ఆ చిన్నారిని గోల్కొండలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అదే సమయంలో సమీపంలోని మసీదు నుంచి బయటకు వస్తున్న ఫిరోజ్.. ఆటోలో చిన్నారి ఏడుపును గమనించారు. ఏదో అనర్థం జరుగుతుందని అనుమానించిన అతను వెంటనే ఆటోను అడ్డుకున్నారు. ఆటో డ్రైవర్ సలీంను నిలదీయడంతో భయపడిన అతను చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు.ఫిరోజ్ అంతటితో ఆగకుండా.. బాలిక ఐడీ కార్డులోని ఫోన్ నంబర్ ఆధారంగా ఆమె తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించారు. అప్పటికే స్కూల్ వద్ద బిడ్డ కనిపించక ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు ఫిరోజ్ ఫోన్ ప్రాణం పోసింది. విధుల్లో ఉన్న అబిడ్స్ బ్లూ కోట్స్ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్ వెంటనే స్పందించి గోల్కొండకు చేరుకున్నారు. బాలికను సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో నిందితుడు సలీంను ఏప్రిల్ 2న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు స్పందించే గుణం గొప్పదని అన్నారు. నేరం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా ఫిరోజ్ చూపిన చొరవ వెలకట్టలేనిదని ప్రశంసించారు. ప్రతి పౌరుడు ఫిరోజ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని.. నేర రహిత సమాజం కోసం పోలీసులతో సహకరించాలని కోరారు. అలాగే సమర్థవంతంగా పనిచేసిన కానిస్టేబుళ్లను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమయానికి స్పందించిన ఫిరోజ్ వల్ల ఒక చిన్నారి జీవితం సురక్షితంగా మిగిలిందని.. ఇలాంటి సాహసాలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.