తెలంగాణలో ఉన్న జ్ఞాన స‌ర‌స్వతి ఆల‌యమైన బాసరకు మహర్దశ పట్టనుంది. ఈ క్రమంలోనే బాసర సరస్వతి దేవాలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌ రెడీ అయింది. ఈ మాస్టర్ ప్లాన్‌లో ఆలయ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నమూనాను విడుదల చేసింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఇబ్బంది లేకుండా.. ఈ మాస్టర్ ప్లాన్‌లో పలు అభివృద్ధి పనులు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే బాసర ఆలయ పునరభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి .. నేడు భూమి పూజ చేయనున్నారు.రాష్ట్రంలో అక్షరాభాస్యాల‌కు నిలయమైన బాసరలో ఆచారాల‌కు అనుగుణంగా రాజ‌గోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలను నిర్మించనున్నారు. ఏటా వ‌సంత పంచ‌మి, ఇత‌ర ప‌ర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చి.. తమ పిల్లల‌కు అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు. అయితే బాసర ప్రాచీన ఆల‌యం కావ‌డంతో.. పెరుగుతున్న భ‌క్తులకు అనుగుణంగా అక్కడ త‌గిన‌ ఏర్పాట్లు, అభివృద్ధి ప‌నులు చేప‌ట్టపోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బాస‌ర ఆల‌య అభివృద్ధి చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మన సంప్రదాయాలు, ఆచారాల‌కు అనుగుణంగా ఆల‌య అభివృద్ధి ప‌నులు చేప‌ట్టేందుకు మాస్టర్ ప్లాన్ త‌యారు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.శృంగేరి పీఠాధిప‌తుల‌ను సంప్రదించిన తర్వాత.. అధికారులు బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పం, రాజ గోపురం, ఇత‌ర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాల‌కు సంబంధించి పీఠాధిపతుల నుంచి అన్ని అనుమ‌తులు తీసుకున్నారు. వారు చేసిన సూచ‌న‌ల‌ ఆధారంగా బాసర ఆలయ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేశారు.పెరుగుతున్న భ‌క్తుల సంఖ్య, భ‌విష్యత్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 2 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉన్న గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పాన్ని ఏకంగా 5 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెంచేందుకు మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేశారు. ఉత్తరం వైపున 9 అంత‌స్తుల రాజ‌గోపురం.. మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు.. 33 అడుగుల వెడ‌ల్పుతో 4 దిక్కుల్లో మాడ వీధులు.. ఉత్తర ద్వారాన్ని నిర్మించ‌నున్నారు. మొత్తంగా ఇప్పుడు ఉన్న 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల బాసర ఆల‌య విస్తీర్ణాన్ని.. ఏకంగా 62 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెంచుతున్నారు. దీంతో గతం కంటే 3 రెట్లు విశాలంగా ఆలయం కనిపించనుంది.ఆల‌యంలో ప్రతీ నిర్మాణాన్ని శిల‌ల‌తో చేప‌ట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 6 వేల మంది భ‌క్తులకు ఫీడింగ్ రూమ్‌, ఫుడ్ స్టాల్స్‌, టాయిలెట్స్ వంటి అన్ని వ‌స‌తుల‌తో 70 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌తో క్యూ కాంప్లెక్స్‌లు.. ఒకేసారి 200 మంది కూర్చొని ధ్యానం చేసేలా ధ్యాన మందిరం.. 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యంతో భారీ వంట శాల‌.. భోజ‌న శాల‌లు.. ప్రసాద పంపిణీ కేంద్రం.. ఈశాన్య దిక్కున కోనేరు.. తూర్పు దిక్కున ఆధ్యాత్మిక‌త ఉట్టిపడేలా అద్భుత‌మైన తోర‌ణాలు.. స‌మాచార కేంద్రం.. దేవాల‌యానికి ఉత్తర‌, తూర్పు దిక్కుల్లో రోడ్ల నిర్మాణం.. దేవాల‌యం నుంచి అవ‌త‌లి వైపు వెళ్లేందుకు అండ‌ర్ పాస్‌.. అవ‌త‌లి వైపున సోలార్ రూప్‌టాప్‌తో వాహ‌నాల పార్కింగ్‌.. ఆల‌య ప్రాంగణంలో ఆహ్లాద‌క‌ర‌మైన మొక్కలతో పుష్పవ‌నం ప‌నులను ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేప‌ట్టనున్నారు. భక్తుల ఆరోగ్యం కోసం.. ఆల‌య ప్రాంగ‌ణానికి అవతల హెల్త్ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నున్నారు. భ‌విష్యత్‌లో ఆల‌యం వెనుక భాగం భారీ వృక్షాలు పెరిగేలా మొక్కలను కూడా నాట‌నున్నారు. మరోవైపు.. వ‌చ్చే ఏడాది జూన్‌లో గోదావ‌రి న‌ది పుష్కరాలు జరగనున్నాయి. ఆ స‌మ‌యంలో ల‌క్షలాది మంది భ‌క్తులు పుణ్య స్నానాల‌ కోసం బాస‌రలోని గోదావ‌రి తీరానికి చేరుకోనున్నారు. దీంతో వారికి అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులను కల్పించేందుకు.. ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశారు. భ‌క్తులకు ఇబ్బంది లేకుండా.. ఆల‌య సంప్రదాయాలు, విశ్వాసాల‌కు అనుగుణంగా బాసర ఆలయ పునరభివృద్ధి ప‌నులను చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.ద‌క్షిణ గంగగా గుర్తింపు పొందిన గోదావ‌రి న‌దీ తీరంలో ఉన్న ఈ బాస‌ర క్షేత్రంలో జ్ఞాన స‌ర‌స్వతీ దేవి కొలువై ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ప్రశాంత‌త కోసం వేద వ్యాస మ‌హ‌ర్షి గోదావ‌రి తీరానికి వ‌చ్చి బాస‌ర‌లో నివ‌సించార‌ని.. ఆ స‌మ‌యంలో స్వయంగా ఆయ‌నే గోదావ‌రి ఇసుక‌తో జ్ఞాన స‌ర‌స్వతితో పాటు మ‌హాల‌క్ష్మి, మ‌హాకాళి అమ్మ వార్ల మూర్తుల‌ను ప్రతిష్ఠించార‌నేది స్థల పురాణం. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాస‌ర ప్రసిద్ధి చెందింది.