కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తరహాలో దేశ విదేశాల్లో ఆలయాలు నిర్మాణం అవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాలు శరవేగంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తిరుమల లాంటి ఆలయాలు రూపుదిద్దుకోనున్నాయి. తాజాగా నెదర్లాండ్స్‌కు చెందిన ప్రవాస భారతీయులు.. ఆ దేశంలో కూడా తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. దీని కోసం అక్కడి ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించడం విశేషం. ఆ గుడి నిర్మాణానికి అయ్యే ఖర్చును ఎన్నారైలు భరించనున్నారు. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్‌లో నిర్మించే శ్రీవారి ఆలయానికి టీటీడీ సహకారం కావాలని.. ప్రవాసాంధ్రులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులతో కూడిన (ఎస్వీకే) సంస్థ అక్కడ శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని చేపట్టనుంది. ఇందుకోసం నెదర్లాండ్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. అక్కడి సర్కార్ ఏకంగా 33.5 ఎకరాల భూమిని కేటాయించి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.250 కోట్లతో నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఎస్వీకే సంస్థ సిద్ధమైంది. ఇందులో భాగంగానే శ్రీ వసుదైవ కుటుంబం అధ్యక్షులు అశోక్ కుమార్ నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును హైదరాబాద్‌లో కలిశారు. నెదర్లాండ్స్‌లో తాము నిర్మించనున్న ఆలయానికి టీటీడీ నుంచి సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. స్థల పరిశీలనతోపాటు.. ఆలయ గోపురాలు, ప్రాకారాలు.. ఆలయ మండపాలు.. శిల్పకళ.. వేద పాఠశాల ఏర్పాటుతోపాటు.. స్థపతి వంటి అనేక అంశాల్లో టీటీడీ సహకారం అందించాలని బీఆర్ నాయుడును కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఛైర్మన్‌ బీఆర్ నాయుడు టీటీడీ నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. సనాతన ధర్మవ్యాప్తికి టీటీడీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ పూనుకుందని వివరించారు. నెదర్లాండ్స్‌లో ఉన్న ఒక లాభాపేక్షలేని సంస్థనే శ్రీ వసుదైవ కుటుంబం. ప్రపంచమే ఒక కుటుంబం అనే నినాదం ఆధారంగా భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మికతను ప్రోత్సహించేందుకు ఈ శ్రీ వసుదైవ కుటుంబం సంస్థ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఇక నెదర్లాండ్స్‌లో సుమారు 2.20 లక్షల నుంచి 2.40 లక్షల మంది భారతీయ మూలాలు ఉన్నవారు నివసిస్తున్నారు. సురినామ్ నుంచి నెదర్లాండ్స్‌కు వలస వచ్చిన వారు సుమారు 2 లక్షల వరకు ఉంటారు. ఇక భారత్ నుంచి నెదర్లాండ్స్‌కు నేరుగా వెళ్లిన వారు (ప్రవాస భారతీయులు) సుమారు 25 వేల నుంచి 30 వేల వరకు ఉంటారు.