ఆఫ్ ది ఫీల్డ్‌తో పాటు ఆన్ ది ఫీల్డ్ ఎంత ఫన్నీగా ఉంటాడో అందరికీ తెలుసు. కుల్దీప్ యాదవ్‌తో అయితే గ్రౌండ్‌లో ఉన్నోళ్ల పాటు టీవీల ముందు కూర్చున్నోళ్లు కూడా పడి పడి నవ్వాల్సిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో డీఆర్ఎస్ తీసుకునే సమయంలో కుల్దీప్ యాదవ్ - రోహిత్ శర్మ మధ్య సీన్స్ అయితే ఇప్పటికీ నవ్వు తెప్పిస్తాయి. కుల్దీప్ గురించి బాగా తెలిసిన రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఓ చిన్న ట్రిక్ ఉపయోగించి ఢిల్లీ మొత్తాన్ని బురిడీ కొట్టించాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తుండగా స్ట్రయికింగ్‌లో రోహిత్ శర్మ ఉన్నాడు. ఐదో బంతిని రోహిత్ స్వీప్ చేయడానికి ప్రయత్నించగా బంతి ప్యాడ్‌ను తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా.. రోహిత్ మాత్రం అవుటైనట్టు క్రీజు వదిలి వెళ్లడానికి ప్రయత్నించాడు. డీఆర్ఎస్‌కు ఎప్పుడూ ముందుండే కుల్దీప్ యాదవ్ వెంటనే రివ్యూకి వెళ్దామంటూ కోరాడు. రోహిత్ పక్కకు వెళ్లడంతో అనుమానం వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ వెంటనే డీఆర్ఎస్ తీసుకున్నాడు. రివ్యూకి వెళ్లిన తర్వాత అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను కాకుండా ప్యాడ్‌ను తాకినట్లు చూయించింది. దాంతో రోహిత్ శర్మ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. రోహిత్ మైండ్ గేమ్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ రివ్యూ వేస్ట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఆరెంజ్ క్యాప్ అందుకోడానికి వెళ్లిన రోహిత్ శర్మను ప్రజంటేటర్స్ ఈ ఇన్సిడెంట్ గురించి అడిగారు. దాంతో రోహిత్ శర్మ నవ్వుతూ తనకు కుల్దీప్ యాదవ్ గురించి తెలుసని, అందుకే అలా ట్రై చేశానని చెప్పాడు. "కుల్దీప్ గురించి నాకు బాగా తెలుసు. 50-50 ఛాన్స్ ఉన్నప్పుడు వెంటనే డీఆర్ఎస్ తీసుకుంటాడు. అందుకే కొంచెం లక్ ట్రై చేశా. అది మాకు ఫేవర్‌గా వచ్చింది" అని అన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్యా దూరమైన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 35, సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులు చేశాడు. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీకి మరోసారి సమీర్ రిజ్వీ అద్భుతమైన బ్యాటింగ్ అందించాడు. 51 బంతుల్లో 90 పరుగులు చేయగా, పాతుమ్ నిస్సాంక 44, డేవిడ్ మిల్లర్ 21 పరుగులతో 18.1 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి రాగా, ఓటమితో ముంబై ఆరో స్థానానికి పడిపోయింది.