అయోధ్య రాముడిని దర్శించుకొని.. బెంగాల్‌కు సీఆర్పీఎఫ్ బలగాలు.. మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు..!

Wait 5 sec.

. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు తూర్పున ఉన్న అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ప్రచారం ఊపందుకుంది. అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బంగ్లాదేశ్ సరిహద్దులో ఉండటంతోపాటు.. కొంత సున్నిత ప్రాంతాలు కావడంతో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించన్నారు. పెద్ద రాష్ట్రం కావడంతోపాటు.. సరిహద్దు రాష్ట్రం కూడా కావడం, తీర ప్రాంతం కూడా ఉండటంతో బెంగాల్‌పై ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. బెంగాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడటం కోసం దాదాపు 2.4 లక్షల సీఆర్పీఎఫ్ బలగాలను ఆ రాష్ట్రంలో ఈసీ మోహరిస్తోంది. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలు జమ్మూ కాశ్మీర్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి పశ్చిమ బెంగాల్ వైపు బయల్దేరాయి. అయితే ఎన్నికల విధుల కోసం బెంగాల్ చేరుకునే క్రమంలో.. జమ్మూ కశ్మీర్ నుంచి బయల్దేరిన 200 మందికిపైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకున్నారు. జమ్మూ కశ్మీర్ నుంచి న్యూఢిల్లీ-లక్నో ఎక్స్‌ప్రెస్ వే మీదుగా కాన్పూర్ నుంచి బెంగాల్ వెళ్లాల్సిన సీఆర్పీఎఫ్ బలగాలు.. అయోధ్యను సందర్శించడం కోసం తమ మార్గాన్ని మార్చుకొని 280 కి.మీ. అదనంగా ప్రయాణించారు. బెంగాల్ లాంటి కీలక రాష్ట్రంలో.. మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ఎన్నికల విధుల కోసం వెళ్తున్న భద్రతా బలగాలు రామ మందిరాన్ని దర్శించుకోవడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవారు ‘నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలి’ అనే ప్రాతిపదికన.. సీఆర్పీఎఫ్ బలగాలు రామ మందిరాన్ని సందర్శించిన తీరును.. గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పని చేసిన ఓ అధికారి ప్రశ్నించారు. గతంలో బీఎస్ఎఫ్ అధినేతగా పని చేసి రిటైర్ అయిన ఓ ఐపీఎస్ అధికారి మాత్రం ఇందులో తప్పేమీ లేదన్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న రామమందిరంలో రెండేళ్ల క్రితమే ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని ఆయన గుర్తు చేశారు. దాడి చేయడానికి యూపీ నుంచి వస్తున్నారు..సీఆర్పీఎఫ్ బలగాలు రామ మందిరాన్ని సందర్శించుకోవడంతో.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీపై దాడి చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి అయోధ్య మీదుగా వస్తున్నారంటూ నదియా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బెంగాల్ ప్రజలను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. అయితే దీనికి భయపడాల్సిన పని లేదని.. ఇది కేవలంలో ఓ ట్రిక్ మాత్రమేనని.. తిరుగులేని శక్తి ఓటర్ల చేతుల్లోనే ఉందని ఆమె తెలిపారు. అంటూ ఇప్పటికే వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ.. వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.మమత వ్యాఖ్యలపై స్పందించిన సీఆర్పీఫ్, ఈసీ టీఎంసీ అధినేత్రి చేసిన వ్యాఖ్యలపై సీఆర్పీఎఫ్ స్పందించింది. ఎలాంటి భయం లేకుండా, ప్రశాంతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడటమే తమ లక్ష్యమని సీఆర్పీఎఫ్ స్పష్టం చేసింది. నిర్దేశించిన నిబంధనల ప్రకారమే, నిష్పక్షపాతంగా కేంద్ర సాయుధ బలగాలను మోహరిస్తున్నట్లు ఎన్నికల సంఘం కూడా తెలిపింది. ఏప్రిల్ 1న మాల్డాలో ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను గంటల తరబడి బందీలుగా ఉంచారు. ఈ ఘటన తర్వాత ఎన్నికల సంఘం బెంగాల్‌లో సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు ఏర్పాట్లు చేసింది.లోక్ సభ ఎన్నికల సమయంలో భారీగా బలగాల మోహరింపు..2024 లోక్ సభ ఎన్నికల సమయంలోనూ పశ్చిమ బెంగాల్‌లో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. బెంగాల్‌లో ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా సుమారు 3.4 లక్షల కేంద్ర సాయుధ బలగాలను ఆ రాష్ట్రంలో మోహరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. అంతే కాదు 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కశ్మీర్లో మోహరించిన బలగాల కంటే బెంగాల్ మోహరించిన బలగాల సంఖ్యే ఎక్కువ. ఇప్పుడు కూడా ఎన్నికల సంఘం దాదాపు 2.4 లక్షల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. బెంగాల్లో పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.