తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతూనే ఉంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉద్యోగాలతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కింద.. మహిళా సంఘాలకు ఉపాధి మార్గాలు చూపిస్తోంది. ఈ క్రమంలోనే పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే నడిచేలా తెలంగాణలో 2 పెట్రోల్ బంకులను ఇప్పటికే ఏర్పాటు చేయగా.. అవి లాభాలతో కళకళలాడుతున్నాయి. దీంతో ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేసి.. మహిళా శక్తిని చాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ పెట్రోల్ బంకుల్లో సిబ్బంది, మేనేజర్లు, ఆపరేటర్లు చివరికి ఓనర్లు కూడా అందరూ మహిళలే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఇందిరా మహిళాశక్తి పథకం కింద సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. వాటికి మంచి లాభాలు వస్తుండటంతో.. మిగిలిన జిల్లాల్లోనూ వీటిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా మరో 40 చోట్ల మహిళా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ పెట్రోల్ పంపుల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తి చేసింది. త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనుండగా.. వీటి కోసం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇందులో దాదాపు సగం అంటే 20 పెట్రోల్ బంకులను.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2వ తేదీ నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్‌) యోచిస్తోంది. ఆదిలాబాద్‌లోని కైలాష్‌నగర్.. నల్గొండ జిల్లా గండవారిగూడెం, కుమురం భీమ్‌ జిల్లా ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లా భూపతిపురం, వికారాబాద్‌ జిల్లా హకీంపేట్‌ దుడ్యాల్‌లలో కొత్త పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయి. వీటితోపాటు కరీంనగర్, మెదక్, ములుగు, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లోనూ కొత్త బంకులు రానున్నాయి. హనుమకొండ జిల్లా మడికొండ.. ఖమ్మం జిల్లా వెంకటాపురం, సాదిరెడ్డిపల్లి, ఖానాపురం హవేలి.. కామారెడ్డి జిల్లా మల్తుమ్మెద.. కొత్తగూడెం జిల్లా రామవరం, కొత్తగూడెం.. జనగామ జిల్లా రఘునాథపల్లి.. జగిత్యాల జిల్లా కోరుట్ల.. భూపాలపల్లి జిల్లా మైలారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా పాలకొండ.. మేడ్చల్‌ జిల్లా అలియాబాద్.. మంచిర్యాల జిల్లా మందమర్రి.. నిర్మల్‌ జిల్లా సోఫానగర్.. నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూరు, పెద్దాపూర్.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్, వట్టినాగులపల్లి.. వనపర్తి జిల్లా మిరాస్‌పల్లి.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్.. వరంగల్‌ జిల్లా రాయపర్తి.. భువనగిరి జిల్లా మల్కాపురం.. సంగారెడ్డి జిల్లా కవేలి, కోడూరులలో ఇప్పటికే కొత్త పెట్రోల్ పంపుల కోసం భూములను సేకరించి మహిళా సంఘాలకు అప్పగించారు. మరోవైపు.. సిద్దిపేట, నిజామాబాద్, భువనగిరి, జోగులాంబ గద్వాల్‌ జిల్లా నారాయణపురం, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, సూర్యాపేట జిల్లా రేపాల, మహబూబాబాద్‌ జిల్లా తానంచెర్లలో భూములను గుర్తించగా.. మహిళా సంఘాలకు ఇంకా అప్పగించాల్సి ఉంది.