అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్‌ మిట్టల్, నిప్పన్‌ స్టీల్‌ ఇండియా స్టీల్‌ప్లాంట్‌‌కు శంకుస్థాపన జరిగింది. అయితే ఈ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చేందుకు ఓ జూమ్ కాల్ కారణమంటూ మంత్రి లోకేష్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో వివరించారు. తాను 2019 జనవరిలో దావోస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు ఆర్సెలాల్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్‌ను కలవడానికి ప్రయత్నించానన్నారు లోకేష్. కానీ ఆ సమయంలో కుదరలేదని.. అయితే ఆ తర్వాత ఆయన్ను కలిసే అవకాశం వచ్చిందన్నారు. ఆదిత్యను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరానని.. ఆయన మాత్రం తాము వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నామని తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ ఆ ప్రయత్నాలు జరగకపోతే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం సిద్ధంగా ఉందని ఆ రోజు ఆదిత్యకు చెప్పానన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిత్య మిట్టల్‌తో మాట్లాడిన ఓ జూమ్ కాల్‌ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను మార్చేసిందన్నారు. 2024 సెప్టెంబర్ 22న రాత్రి ఆదిత్య మిట్టల్‌తో తాను అరగంట పాటూ జూమ్ కాల్‌లో మాట్లాడానన్నారు మంత్రి లోకేష్. ఆ చర్చల ఫలితంగా.. దేశంలోనే అతి పెద్ద స్టీల్‌ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఈ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ రాక నిదర్శమన్నారు. ఆదిత్య మిట్టల్‌తో మాట్లాడిన తర్వాత రెండు నెలలకే ఏపీ ప్రభుత్వం నుంచి స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ప్రోత్సాహకాలు అందించామన్నారు. మూడు నెలల్లో పరిశ్రమకు అవసరమైన భూమి.. ఆ వెంటనే పర్యావరణ, అటవీ అనుమతులు కూడా వచ్చాయన్నారు. మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి ఎన్‌ఎండీసీతో సమన్వయం, స్లర్రీ పైపులైన్‌ అనుమతుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు మంత్రి లోకేష్. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి పీఎంవో, కేంద్రంతో మాట్లాడి సమన్వయం చేసి.. ఆ సమస్యల్ని పరిష్కరించడంతో స్టీల్‌ప్లాంట్‌కు అడ్డంకులు తొలగిపోయాయన్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు అందించడం ఆనందంగా ఉందన్నారు. మిట్టల్ స్టీల్‌ప్లాంట్ రాకతో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. తన యువగళం పాదయాత్ర సమయంలో ఓ మహిళతో మాట్లాడిన సందర్భంలో జరిగిన ఘటనను మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు. మహిళ భర్త చనిపోతే కష్టపడి ఇద్దరు కుమారుల్ని చదివించిందని.. వారికి ఉద్యోగాలు కావాలని ఆమె తనను అడిగిన మాటను ప్రస్తావించారు. అందుకే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చామన్నారు. ఆ మహిళ మాటల్ని ప్రేరణగా తీసుకుని తాను ఆ హామీని ఇచ్చానన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్‌ప్లాంట్‌‌కు శంకుస్థాన జరిగింది. ఏడాదికి 17.8 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో 5,465 ఎకరాల్లో 2 దశల్లో దీనిని నిర్మించనున్నారు. ఈ స్టీల్‌ఫ్యాక్టరీ మొదటి దశలో 2,600 ఎకరాల్లో దాదాపు రూ.70 వేల కోట్లతో 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా ప్లాన్ చేశారు. ఈ పరిశ్రమ రాకతో సుమారు లక్ష మందికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు.