మార్చి 28న జాతీయ లోక్‌ అదాలత్ నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణలో పేరుకుపోయిన రాజీపడదగ్గ కేసులను పరిష్కరించేందుకు పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.శ్యాం కోశీకి ఏర్పాట్ల వివరాలను డీజీపీ శివధర్‌రెడ్డి వివరించారు. సోమవారం (మార్చి 23) డీజీపీ ఆఫీసులో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు అధికారులతోపాటు న్యాయమూర్తి శ్యాం కోశీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ..ఈసారి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. అన్నింటకంటే ముఖ్యంగా ఉన్నందున వాటిని క్లియర్ చేసేందుకు ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. దాంతోపాటుగా రాజీపడదగ్గ కేసులు గుర్తించి, ఇరుపక్షాలకు అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ వివరించారు. ఈ సమావేశంలో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, శాంతిభద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్, సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా, ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌ సుధీర్‌ బాబు పాల్గొన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు.వాహన్‌ పోర్టల్‌లోకి తెలంగాణవన్‌ నేషన్‌ - వన్‌ రిజిస్ట్రీ లక్ష్యంతో దేశవ్యాప్తంగా వాహనాల డేటాను ఒకే చోట చేర్చే కేంద్ర ప్రభుత్వ వాహన్‌ పోర్టల్‌లో తెలంగాణ కూడా చేరింది. ఈ కొత్త పోర్టల్‌ ద్వారా రవాణా శాఖలోని పౌర సేవలు మరింత సులభతరం, పారదర్శకం కానున్నాయి. హైదరాబాద్‌ బేగంపేటలోని వరుణ్‌ మోటార్స్‌లో వాహన్‌ పోర్టల్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. ఇక నుంచి 2 శాతం అదనపు పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రవాణా శాఖను ప్రక్షాళన చేస్తూ.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులను ఎత్తేశామని గుర్తు చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఈవీ విధానం ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాలకు తెలంగాణ రాష్ట్రం బ్రాండ్‌గా మారుతుందనే విశ్వాసాన్ని మంత్రి పొన్నం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజుకు సుమారు 1500 వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో సమాచారాన్ని సమర్థంగా నిర్వహించాలంటే లేటెస్ట్ టెక్నాలజీ తప్పనిసరి అని అన్నారు. ఈ అవసరం తీర్చడానికి వాహన్‌ పోర్టల్‌ దోహదపడుతుందని... రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ, పన్ను చెల్లింపులు వంటి సేవలు ప్రజలకు సులువుగా అందుతాయని చెప్పారు. ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై స్పందిస్తూ.. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ రెండూ విధానపరమైన అంశాలని అన్నారు. అవి ప్రభుత్వ దృష్టిలోనే ఉన్నాయిని.. వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్మికులు సమ్మెకు వెళ్లరని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.