ఇన్వెస్టర్లను ముంచేసిన 'యుద్ధం'.. 24 రోజుల్లో రూ.48 లక్షల కోట్లు లాస్.. ఆ అంశాలే ప్రధాన కారణం

Wait 5 sec.

Market Crash: ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు కొనసాగిన తరుణంలోనే భారత్ బలంగా నిలబడింది. ఈ భరోసాతోనే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ వచ్చిన ఇన్వెస్టర్లకు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. భారత్‌లో రాజకీయ స్థిరత్వం, ఆదాయపు పన్ను- జీఎస్టీ రేట్ల కోత వంటి సానుకూలతలు ఉన్నప్పటికీ యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28వ తేదీ నుంచి చూసుకుంటే గడిచిన ఈ 24 రోజుల్లోనే ఏకంగా రూ. 48.29 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు 10 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలు భారీ స్థాయిలో కరిగిపోయాయి. బంగారం ధరలు సైతం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. రూపాయి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టిందన్న వార్తలతో మార్చి 23వ తేదీ సోమవారం సైతం సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 112 డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత క్షీణించడమూ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ వాల్యూ సోమవారం ఒక్కరోజే ఏకంగా రూ. 13.9 లక్షల కోట్లు పడిపోయింది. దీంతో కంపెనీల మార్కెట్ విలువ రూ. 415.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. . ఉదయం సెన్సెక్స్ 73,732 పాయింట్ల వద్ద నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టగా ఆ తర్వాత భారీగా తగ్గి ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 72,558ని తాకింది. చివరకు 1837 పాయింట్ల నష్టంతో 72,697 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 22,471 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 602 పాయింట్లు కోల్పోయి 22,512 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన ఫిబ్రవరి 28వ తేదీ నుంచి సెన్సెక్స్ 8591 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 50 సూచీ 2666 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో టైటాన్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 5 శాతానికిపైగా పడిపోయాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండిగో, టాటా స్టీల్, హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్ షేర్లు 4 శాతానికిపైగా నష్టపోయాయి.