ఆంధ్రప్రదేశ్‌లో విద్యాహక్కు చట్టం-2009 కింద.. ప్రతి ఏటా ప్రైవేట్ స్కూల్స్‌లో అర్హత కలిగిన పేద విద్యార్థులు చదువుకునేందుకు అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వమే మొత్తం ఫీజుల్ని చెల్లిస్తుంది. అయితే ఓ ప్రైవేట్ స్కూల్ విద్యాహక్కు చట్టం కింద సీటు ఇవ్వకుండా తిరస్కరించడంపై ఓ విద్యార్థిని తల్లి హైకోర్టును ఆశ్రయించారు. కర్నూలు మండలం బి తాండ్రపాడుకు చెందిన రబియా బషీర్ ఖాతూన్ కుమార్తె అఫ్సాబీకి విద్యా హక్కు చట్టం కింద.. 2023-2024లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉచితంగా చదువుకునేందుకు ఒకటో తరగతిలో సీటు వచ్చింది. అఫ్సాబీ ఒకటి, రెండో తరగతులు అదే స్కూల్‌లో పూర్తి చేశారు.. బాలిక 2025-26లో మూడో తరగతికి వెళ్లింది. విద్యార్థిని జూన్‌లో స్కూల్‌కు వెళ్లగా.. ఉచిత విద్య కింద అడ్మిషన్‌ రాలేదని స్కూల్‌ సిబ్బంది చెప్పారు. 3వ తరగతికి సంబంధించిన ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఉంటుందని స్కూల్ యాజమాన్యం తమతో చెప్పారని అఫ్సాబీ తల్లి రబీయా బషీర్ ఖాతూన్‌ అంటున్నారు. వెంటనే ఆమె జిల్లా విద్యాశాఖ అధికారుల్ని కలిసి సమస్యను వివరించారు. తాను ఐదుసార్లు వినతి పత్రాలు ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఖాతూన్ ఆరోపించారు. కర్నూలు జిల్లా విద్యా శాఖ అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా స్వీకరించారు. అఫ్సాబీని వెంటనే స్కూల్‌లో చేర్పించాలని కోర్టు ఆదేశించింది. సీటు నిరాకరించిన ఆ ప్రైవేట్ స్కూ్‌ల్‌కు సంబంధించిన పత్రాలతో పటుగా ఉచిత విద్యలో అడ్మిషన్‌ లేదని చెప్పడానికి గల కారణాలను తెలియజేస్తూ ఓ నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్, జిల్లా విద్యా శాఖ, కలెక్టర్, ప్రైవేట్ స్కూల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరి చిన్నారి అఫ్సాబీ అడ్మిషన్ విషయంలో ఏపీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది చూడాలి.