హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. దక్షిణ భాగంపై కీలక అప్డేట్, కేంద్రమంత్రి గడ్కరీ లేఖ

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు పడింది. ఈ రహదారి దక్షిణ భాగానికి సంబంధించిన డీపీఆర్‌పై కేంద్రం అప్డేట్ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్ దక్షిణ భాగానికి కన్సల్టెన్సీ డీపీఆర్‌ను రూపొందిస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేఖ రాశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం డీపీఆర్‌ తయారీకి సంబంధించి చర్యలు చేపట్టామని.. కన్సల్టెన్సీని అపాయింట్‌ చేసినట్లు గడ్కరీ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2025 ఆగస్టు 5నదక్షిణ భాగానికి అనుమతివ్వాలని కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందిస్తూ దక్షిణ భాగానికి డీపీఆర్‌ తయారీలో ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ మంత్రికి లేఖ రాశారు. డీపీఆర్‌పై నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని లేఖలో తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం డీపీఆర్‌పై నితిన్‌ గడ్కరీ లేఖ రాయడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.. గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర భాగం ఇప్పటికే మంజూరై.. టెండర్‌ దశలో ఉందని కోమటిరెడ్డి గుర్తు చేశారు. దక్షిణ భాగం పట్ల కూడా కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రావడం శుభపరిణామం అన్నారు. తెలంగాణకు ఆర్‌ఆర్‌ఆర్‌ గేమ్‌ ఛేంజర్‌ కాబోతుందన్నారు మంత్రి. కేంద్రం సహకారంతో ఆర్ఆర్ఆర్‌ను చేపట్టారు.. ఈ ప్రాజెక్టులో ఉత్తరభాగం మొత్తం 161.5 కిలోమీటర్ల (సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి జిల్లాలోని తంగడ్‌పల్లి వరకు) మేర రెండు ప్యాకేజీల్లో నిర్మించనున్నారు. ఈ మేరకు త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. దాదాపు రూ.21వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. అలాగే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ దక్షిణ భాగం మొత్తం 201 కిలో మీటర్లు (తంగడ్‌పల్లి నుంచి సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్‌ వరకు) కాగా.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తరభాగంతో సమాంతరంగా దక్షిణ భాగం ఈ పనులనూ చేపట్టాలనిగతంలో డీపీఆర్‌ను చేపట్టింది. కేంద్రానికి కూడా తెలంగాణ సర్కార్ అనేకసార్లు రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు డీపీఆర్‌పై అప్డేట్ వచ్చింది.