తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్.. 5 రకాల టిఫిన్‌లతో మెనూ, ఐటెమ్స్ లిస్ట్ ఇదే

Wait 5 sec.

తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త.. ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద విద్యార్థులకు 5 రకాల టిఫిన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో ఈ టిఫిన్లు విద్యార్థులకు అందిస్తారు. వారంలో ఆదివారం సెలవు కాబట్టి మిగిలిన ఆరు రోజులు ఉదయం టిఫిన్, పాలు/రాగిజావ అందించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరు రోజులలో రెండు రోజుల పాటూ మిల్లెట్ ఇడ్లీ ఉంటుంది. మిగిలిన నాలుగు రోజులు మిల్లెట్ ఉప్మా, దోసె, బోండ, పూరిని మెనూలో చేర్చారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు ఇదే మెనూ అమలు చేయాలని నిర్ణయించారు.ఈ మెనూకు సంబంధించి మరో వెసులుబాటు కూడా కల్పించింది ప్రభుత్వం. సోమవారం దోసెకు బదులు చపాతీ, శుక్రవారం మిల్లెట్‌ ఉప్మాకు బదులు పొంగల్‌ ప్లాన్ చేశారు. వీటిలో ఏది వీలైతే దాన్ని అందించేలా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.720 ఖర్చు అవుతందని అంచనా వేయగా.. వీటిలో పాఠశాల విద్యార్థుల టిఫిన్‌కు రూ.540 కోట్లు, పాల కోసం రూ.180 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటికే ఈ నిధుల్ని బడ్జెట్‌లో కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక ఇంటర్ విద్యార్థులకు సంబంధించి రూ.56 కోట్లు కేటాయించారు. ఈ ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద సుమారు 22 లక్షలమంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. విద్యార్థులు టిఫిన్ తినడానికి 45 నిమిషాలు కేటాయిస్తారు.ఈ మెనూలో.. సోమవారం దోసె-చట్నీ/చపాతీ-కర్రీ.. మంగళవారం మిల్లెట్ ఇడ్లీ (రెండు)-సాంబారు.. బుధవారం పూరి (రెండు)-ఆలూ కుర్మా.. గురువారం మిల్లెట్ ఇడ్లీ (రెండు)-సాంబాబరు.. శుక్రవారం మిల్లెట్ ఉప్మా/ పొంగల్-చట్నీ.. శనివారం బోండా (రెండు)-చట్నీ అందిస్తారు. టిఫిన్‌తో పాటుగా ఒక రోజు పాలు, ఒక రోజు రాగి జావ అందిస్తారు. వారంలో ఆదివారం సెలవు కాబట్టి.. మిగిలిన ఆరు రోజుల్లో.. మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ అందిస్తారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించే లక్ష్యంగా ఈ ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.. అక్కడ తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా 2026 నుంచి నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అమలుచేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.