అనంతపురం జిల్లా తాడిపత్రిలో సంచలనం రేపిన బాలుడు వేంచంద్ర కిడ్నాప్, హత్యకేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు సర్వేశ్‌ కుమార్‌తో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో సర్వేశ్ పోలీసులపై తిరగబడ్డాడు.. వారు హెచ్చరిస్తున్నా వినకుండా, చెత్త కుప్ప పక్కన ఉన్న బీర్ బాటిల్ తీసుకుని పోలీసులపై దాడి చేశాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.. అయినా నిందితుడు వెనక్కి తగ్గకపోవడంతో అతడి మోకాళ్లపై సీఐ రామసుబ్బయ్య కాల్పులు జరిపారు. అయితే ఈ క్రమంలో సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపగా.. సర్వేశ్ రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు.. ఇటు గాయపడిన ఇద్దరు పోలీసుల్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోన కోనఉప్పలపాడులో వేంచంద్ర అనే ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. బాలుడి బావ బోయ సర్వేశ్ మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి చంపేసి కుందనకోటకొండలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. వేంచంద్ర అక్కను బోయ సర్వేశ్‌ వివాహం చేసుకున్నాడు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఉప్పలపాడుకు చెందిన వేంచంద్ర ప్రైవేటు స్కూల్‌లో చదువుకుంటున్నాడు. పిల్లవాడు బుధవారం స్కూల్‌కు వెళ్లాడు.. ఒంటిపూట బడి కావడంతో మధ్యాహ్నం స్కూల్ బస్సు డ్రైవర్ వేంచంద్ర సహా పిల్లల్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన దింపి వచ్చాడు. వేంచంద్ర ఇంటికి బయల్దేరాడు.బాలుడి బావ సర్వేశ్ అప్పటికే అక్కడ ఉన్నాడు.. తినుబండారాలను బాలుడికి ఇచ్చాడు.. మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు. బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. ఓ వ్యక్తి ముసుగు ధరించిన బైక్‌పై రావడం, ఉప్పలపాడులోని ఓ షాపులో తినుబండారాలు కొనుగోలు చేయడం కనిపించింది. అప్పుడే బాలుడు చదవుతున్న స్కూల్ బస్సు రావడం కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అప్పుడు సర్వేశ్ బాలుడ్ని తీసుకెళ్లినట్లు గుర్తించి ఆరా తీస్తే ఈ హత్య వ్యవహారం బయటపడింది.. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సర్వేశ్‌ను సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం పోలీసులు తీసుకెళ్లిన సమయంలో కాల్పుల ఘటన జరిగింది. సర్వేశ్ ఉగాది పండుగ కోసం భార్యతో కలిసి అత్తారింటికి వచ్చాడు. అయితే అక్కడ తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని అత్తామామలపై కక్ష పెంచుకున్నాడు. అందుకే బావమరిది వేంచంద్రకు తినుబండారాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి హత్య చేసినట్లు తెలుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.