ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తెకు నారా లోకేష్ 'వెడ్డింగ్ గిఫ్ట్'.. నాకు ఎసరు పెట్టొద్దని దండం పెట్టిన ఎమ్మెల్యే

Wait 5 sec.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేదీ ఎవరూ ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయ నేతలు వేసే ప్రతి అడుగు రాజకీయంతో ముడిపడి ఉంటుంది. రాజకీయ కారణాలతో కలగలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్.. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె వివాహ వేడుకల్లో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ సీనియర్ నేత, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె నాగసాయి వైదీప్తి వివాహం బుధవారం రోజు అట్టహాసంగా జరిగింది. గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో నాగసాయి వైదీప్తి- కెవిన్ రామ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత సహా పలువురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వివాహ వేడుకల్లో నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంభాషణ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇరువురు నేతల ఆత్మీయ పలకరింపు వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో.. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వధూవరులతో సరదాగా సంభాషించిన మంత్రి నారా లోకేష్.. "మహిళా రిజర్వేషన్ వస్తోంది రెడీగా ఉండు.. అంటూ" పెళ్లి కుమార్తె, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తెతో సరదాగా అన్నారు. అయితే అక్కడే ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర వెంటనే దీనికి వెంటనే స్పందించారు. మాకే ఎసరు పెడితే ఎలా బాబు గారూ అంటూ నవ్వుతూ దండం పెట్టారు. దీంతో పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి కూడా నవ్వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే.. చట్టసభలలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన చేపడతారని.. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నారా లోకేష్ సరదాగా అన్నప్పటికీ.. భవిష్యత్ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.