మన దేశం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి రోడ్డు ప్రమాదాలు. రహదారి ప్రమాదాల కారణంగా నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతోమంది కాళ్లూ, చేతులూ దెబ్బతిని వైకల్యానికి గురౌతున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం.. ట్రాఫిక్ రూల్స్ పక్కాగా అమలు చేస్తోంది. ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే.. ఉల్లంఘనలకు పాల్పడేవారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పెనమలూరులో రాంగ్ రూట్లో వచ్చి, ప్రమాదానికి కారణమైన ఓ వ్యక్తి రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 21వ తేదీన పెనమలూరుకు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి, తన స్నేహితుడు, బంధువుతో కలిసి బైక్ మీద పెనమలూరు నుంచి కంకిపాడు బయల్దేరారు. అయితే గోసాల వద్దకు వచ్చేసరికి కంకిపాడు మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన తోట సుబ్రమణ్యం అనే వ్యక్తి.. బైక్ మీద రాంగ్ రూట్‍లో వచ్చి వీరి వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో విద్యార్థి, తన స్నేహితుడు, బంధువు ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రాంగ్‌ రూట్‌లో వచ్చి యాక్సిడెంట్ కావటానికి కారణమైన తోట సుబ్రమణ్యం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీఏ అధికారులకు పోలీసులు నివేదిక పంపించారు. మరో వారం, పది రోజులలో తోట సుబ్రమణ్యం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కానున్నట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని పోలీసులు కోరుతున్నారు. మన తప్పిదం కారణంగా మన కుటుంబంతో పాటుగా మరో కుటుంబం కూడా విషాదం చోటుచేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని సూచిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ వాడకం, సీట్ బెల్ట్ పెట్టుకోవటం, రాంగ్ రూట్ డ్రైవింగ్ మానేయటం, సిగ్నల్ జంప్ వంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.