సొంతిల్లు లేకపోతే ఎన్ని రకాల అవస్థలు పడాల్సి వస్తుందో.. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. మనకు కోపం వచ్చినా ఇంటి ఓనర్‌కు కోపం వచ్చినా.. తట్టా బుట్టా సర్దుకుని మనమే ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అంటే ఎవరికైనా చాలా కష్టమే. ఇంకో ఇల్లు వెతుక్కోవడం, సామాన్లు మార్చడం అనేది పెద్ద పని. ఇక పుట్టుకతో అనారోగ్యం, ఎదుగుదల లేని వారిని చూసుకునేందుకు.. వారి పక్కన అనుక్షణం ఎవరో ఒకరు ఉండాల్సిందే. అయితే దురదృష్టవశాత్తు ఈ రెండు సమస్యలు ఒకే కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కుమారుడు పుట్టి 18 ఏళ్లు గడుస్తున్నా.. వయసుకు తగ్గట్లుగా అతడి మెదడు మాత్రం ఎదగలేదు. దీంతో అతడిని చూసి.. ఆ కుటుంబానికి ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. చివరికి ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. ఆ కుటుంబానికి ఇల్లును కేటాయించారు. జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన రాయల రమేష్, సులోచన జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి చిన్న కుమారుడు అజయ్‌(18).. పుట్టుక నుంచే మెదడు ఎదుగుదల లేకపోవడంతో మంచానికే పరిమితం అయ్యాడు. అయితే రమేష్-సులోచన దంపతులకు సొంతిళ్లు లేకపోవడంతో.. వారి కుమారుడిని చూసి ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో తమ సమస్యను ఆ కుటుంబం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది. ఈ వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (తెలంగాణ సీఎంఓ) ఎక్స్ వేదికగా స్పందించింది. ఒకవైపు పుట్టిన బిడ్డ ఎదుగుదల సమస్యలతో బాధపడుతుండగా.. మరోవైపు నివాసం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన రమేష్–సులోచన దంపతుల దీనస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవీయతను చాటుకున్నారని తెలిపింది. వారి కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెంటనే రెవెన్యూ సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపించి.. వారి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారని ట్వీట్ చేసింది. వారి కుటుంబం ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల విచారణలో వెల్లడైంది. రమేష్-సులోచన దంపతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి స్పందించిన అధికారులు.. ఆ కుటుంబానికి తక్షణ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టారు. ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించారు. అల్లిపురంలోని డబుల్ బెడ్రూంల సముదాయంలో వారికి ఒక ఇంటిని కేటాయించారు. మానవీయ కోణంలో స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యలపై జిల్లా అధికారులు చూపిస్తున్న చొరవకు ఖమ్మం ప్రజలు అభినందనలు తెలిపారు.