డిజిటల్ మార్కెటింగ్ పేరుతో రూ.వేల కోట్ల మోసాలు.. క్యూనెట్ సంస్థకు చెందిన 32 మంది అరెస్ట్

Wait 5 sec.

మరో భారీ మల్టీ లెవల్ డిజిటల్ మార్కెటింగ్ మోసాల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా.. సాగుతున్న ఈ మోసాల చిట్టా ఎట్టకేలకు బయటికి వచ్చింది. మల్టీ లెవల్ డిజిటల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ సంస్థ పాల్పడుతున్న అక్రమాలపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఏక కాలంలో పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకేసారి దాడులు నిర్వహించి.. 32 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్యూనెట్ సంస్థ దేశవ్యాప్తంగా వందలాది మంది అమాయకుల దగ్గరి నుంచి కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. 3 రాష్ట్రాల్లో సోదాలు చేసి ఈ నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ నిందితుల నుంచి భారీ మొత్తంలో అగ్రిమెంట్ పేపర్లు, ల్యాప్‌టాప్‌లు, వాచ్‌లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 30 స్పెషల్ టీమ్‌లుగా విడిపోయిన హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు.. ఈ భారీ ఆపరేషన్‌‌ను విజయవంతంగా నిర్వహించినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే ఉన్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఇప్పటివరకు నమోదు చేసిన 4 కేసుల్లో.. కేవలం 11 మంది బాధితుల నుంచే దాదాపు రూ.75 లక్షలు కొట్టేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసులో ఇంకా మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని వివరించారు. ఈ సందర్భంగా మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ స్కీమ్‌ల పట్ల అలర్ట్‌గా ఉండాలని సజ్జనార్‌ సూచించారు. ఇలాంటి స్కీంలలో చేరడం.. ఇతరులను చేర్పించడం చట్టప్రకారం నేరమని పేర్కొన్నారు. ఇలాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్‌లలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే.. వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.తెలంగాణలో హైదరాబాద్, వరంగల్.. ఏపీలో నంద్యాల, విశాఖపట్నం.. కర్ణాటకలోని బెంగుళూరులో ఇంటెలిజెన్స్, సైబర్ పోలీసులు అంతా కలిసి పక్కాగా ప్లాన్ చేసి దాడి చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. నిరుద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇంట్లో ఖాళీగా ఉండే గృహిణులను లక్ష్యంగా చేసుకుని.. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ సంస్థ మోసాలకు తెరతీసిందని వెల్లడించారు. సిద్దిపేట మల్టీ లెవల్ మార్కెటింగ్‌లో మోసపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌ నగరంలోని మధురానగర్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లలో ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు సంబంధించి క్యూనెట్‌ సంస్థపై కేసులు నమోదు కాగా.. వాటన్నింటినీ పోలీసులు సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీంతో వాటన్నింటినీ కలిపి.. సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో క్యూనెట్ బాగోతం బయటికి వచ్చింది. ఈ క్యూనెట్ సంస్థ ప్రధానంగా ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకుల నుంచి లో‌న్లను అమాయకులకు ఎక్కువ వడ్డీ పేరుతో ఇప్పించి.. ఆ తర్వాత క్యూనెట్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఈ ఐటీ ఉద్యోగులుగా ఉన్న క్యూనెట్ సంస్థ ప్రతినిధులు చేసినట్లు గుర్తించారు. కాఫీ షాపుల్లో ఐటీ ఉద్యోగులతో మీటింగ్‌లు ఏర్పాటు చేసి.. ఆకర్షించే ప్లాన్ అంటూ క్యూనెట్ ప్రతినిధులు ఐటీ ఉద్యోగులను బురిడి కొట్టించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఐటీ ఉద్యోగులు క్యూనెట్ ఏజెంట్లుగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది.