10KG Cylinders: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బరువును చేస్తున్నట్లు జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టిపారేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వివరణ ఇచ్చారు. అలాంటి వార్తలను నమ్మవద్దని, వాటిల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. 'ఇది పూర్తిగా ఊహాజనితమైనది, ఏ ఊహాగానంపైనా మాట్లాడేందుకు, వివరణ ఇచ్చేందుకు సాధ్యపడదు. అలాంటి వదంతులను నమ్మవద్దు' అని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీకి చెందిన మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ విభాగం జాయింట్ సెక్రెటరీ సుజాత శర్మ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో ఏర్పడిన వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు సిలిండర్ బరువును తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గృహ వినియోగాలకు 10 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఈ విషయంపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టత ఇవ్వడంతో ఊహాగానాలకు తెరపడినట్లయింది. అయితే, ఈ సిలిండర్లను 10 కేజీలకు తగ్గించాలని, పాత సిలిండర్లలోనే 10 కిలోల ఎల్‌పీజీని నింపి అందించే అవకాశాలను పరిశ్రమ వర్గాలు పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకు ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని ఆయిల్ కంపెనీలు యోచిస్తున్నాయనేది వార్తల సారాంశం. సాధారణంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ఒక కుటుంబానికి సగటున 35 నుంచి 40 రోజుల వరకు వస్తుంది. 10 కిలోల సిలిండర్ అయితే దాదాపు నెల రోజులు వస్తుందని అంచనా. సంక్షోభ పరిస్థితుల్లో పంపిణీ అందిరికీ చేరేలా ఈ మార్పులు చేయాలని ఆయిల్ మార్కెట్ కంపెనీలు భావిస్తున్నట్లుగా ఈ ఉదయం వార్తలు వచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని తాజాగా కేంద్రం స్పష్టత ఇచ్చింది.