హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా

Wait 5 sec.

హైదరాబాద్‌ నగరంలో కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శోభాయాత్రను ప్రశాంతమైన వాతావరణంలో.. అత్యంత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే అటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ).. హైదరాబాద్ పోలీసులు.. కలిసి శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీతారాం బాగ్‌లోని ద్రౌపది గార్డెన్స్‌లో , హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. సోమవారం నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు.2010లో ప్రారంభమైన ఈ శ్రీరామనవమి శోభాయాత్ర.. ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినట్లు అధికారులు వెల్లడించారు. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనున్న ఈ శోభాయాత్రలో భక్తులు భక్తి శ్రద్ధలు, క్రమశిక్షణతో జరుపుకోవాలని సూచించారు. ఇక ఈ శోభాయాత్ర కోసం సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.మరీ ముఖ్యంగా శోభాయాత్రలో చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్.. ఆకతాయిల నుంచి మహిళలను రక్షించడం కోసం షీ టీమ్స్ ఎప్పటికప్పుడు నిఘా పెడతారని తెలిపారు. గత సంవత్సరం వాహనాల బ్రేక్‌డౌన్ కారణంగా శోభాయాత్ర ఆలస్యం అయిన విషయాన్ని గుర్తు చేసిన అధికారులు.. ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.శ్రీరామనవమి శోభాయాత్రను మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రారంభించాలని సూచించారు. ఇరుకుగా ఉండే మార్గాల్లో భారీ వాహనాల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు.. ముందస్తుగానే ట్రయల్ రన్ నిర్వహించుకోవాలని శోభాయాత్ర నిర్వాహకులకు అధికారులు హితవు పలికారు. ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. డీజే సౌండ్‌లకు బదులు సాధారణ సౌండ్ సిస్టమ్ ఉపయోగించాలని పేర్కొన్నారు. అదే సమయంలో ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేలా.. పాటలు గానీ, ప్రసంగాలు గానీ ఉండాలని తేల్చి చెప్పారు. శోభాయాత్రలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా డ్రోన్లను ఉపయోగించాలనుకుంటే పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజలు, శోభాయాత్ర ఉత్సవ సమితి సభ్యులు పోలీసులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.మరోవైపు.. రాముడి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు శోభాయాత్ర మార్గంలో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయడంతోపాటు.. వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. శోభాయాత్రలో పాల్గొనే వాహనాల ఎత్తు విషయంలో.. ఉత్సవ సమితి తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. శోభాయాత్ర సమయంలో ఎదురయ్యే సమస్యలను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రస్తావించగా.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని పరిశీలించారు.