రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. మొన్నటి వరకు ప్రత్యేకంగా నడిచిన రైలు ఇకపై వీకెండ్‌లో రెగ్యులర్‌గా నడవనుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి ఈ రైలు చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం విశాఖపట్నం నుంచి చర్లపల్లి (హైదరాబాద్), ప్రతి శనివారం చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి వెళ్లే రైలును రెగ్యులర్ చేశారు. విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం (18527/18528) రైలు రెగ్యులర్‌గా పట్టాలెక్కనుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి వచ్చిందని తెలియజేశారు అధికారులు. (18527) ఇకపై ప్రతి శుక్రవారం విశాఖ నుంచి చర్లపల్లికి.. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (18528) చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి వస్తుంది. ఈ రైలు ఏప్రిల్ 3 (శుక్రవారం) రోజు విశాఖపట్నంలో ప్రారంభించి మరుసటి ఏప్రిల్ 4 (శనివారం) చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు చర్లపల్లిలో ప్రారంభమై ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట, చర్లపల్లి. చేరుకుంటుందని తెలిపారు. విశాఖపట్నం-చర్లపల్లి (18527) రైలు ఏప్రిల్ 3 నుంచి ప్రతి శుక్రవారం విశాఖపట్నంలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది.. ఈ రైలు మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో (18528) ఏప్రిల్ 4 నుంచి ప్రతి శనివారం చర్లపల్లిలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.విశాఖపట్నం నుంచి తిరుపతి, బెంగళూరుకు కూడా ప్రత్యేక రైళ్లు రెగ్యులర్‌గా నడుస్తాయి. ఏప్రిల్ 1 నుంచి విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం (18505/18506) ఎక్స్‌ప్రెస్‌, ఏప్రిల్ 5 నుంచి విశాఖపట్నం-బెంగళూరు-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (18509/18510) ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తిరుపతికి ప్రత్యేక రైళ్లతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగం ఉంది అంటున్నారు అధికారులు. అటు బెంగళూరు వెళ్లేవారికి కూడా ఉపయోగమే.