ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కోచింగ్‌ సెంటర్లకు సంబంధించి కొత్త నిబంధనల్ని విడుదల చేసింది. ఇకపై రాష్ట్రంలో కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఉన్న కోచింగ్ సెంటర్లు కూడా మూడు నెలల్లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏపీ కోచింగ్‌ సెంటర్లర నియంత్రణ, పర్యవేక్షణ నిబంధనలు-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మొన్నటి వరకు అనుమతులు లేకుండా చాలామంది కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో రెగ్యులర్‌ తరగతులతో పాటే అనధికారికంగా కోచింగ్‌ కేంద్రాలూ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, విద్యార్థుల ఆత్మహత్యల నివారణ దిశగా కోచింగ్ సెంటర్ల పర్యవేక్షణ, నియంత్రణ కోసం ఈ చర్యలు తీసుకుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని నియమించి.. రిజిస్ట్రేషన్, పర్యవేక్షణ, తనిఖీలు చేపడతారు. ఈ కమిటీ కోచింగ్‌ కేంద్రాలకు సంబంధించిన అనుమతులు జారీ చేయడంతో పాటుగా విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారిస్తారు. అలాగే కోచింగ్ సెంటర్లలో మీడియా కథనాలు, పోలీసుల రిపోర్టులు, ఇతర సమాచారం ఆధారంగా కూడా సుమోటోగానూ తనిఖీలు చేసే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరించనున్నారు. కోచింగ్ సెంటర్ భవనానికీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.. తాత్కాలిక ప్రాతిపదికన నడపకూడదు. అంతేకాదు కోచింగ్‌ సెంటర్ గరిష్ఠంగా రోజుకు ఐదు గంటలే పనిచేయాలని.. అలాగే ఆదివారం తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని కూడా కొత్త రూల్స్ చెబుతున్నాయి. కొన్ని కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం గుర్తించగా.. అక్కడ సెలవు రోజుల్లో కోచింగ్‌ సంస్థలు తెరవకూడదు. విద్యారథుల్ని వేధింపులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటారు. అంతేకాదు ఫీజులు చెల్లించే విషయంలో వేధించకూడదు. కోచింగ్ సెంటర్లలో ఆత్మహత్యలకు వీల్లేకుండా స్ర్పింగ్‌ ఫ్యాన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు బాల్కనీలు, టెర్ర్‌సపైకి వెళ్లకుండా నియంత్రణ ఉండాలి. కోచింగ్ సెంటర్లలో మరుగుదొడ్లు, రూమ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి. ప్రతి కోచింగ్ సెంటర్‌కు కచ్చితంగా వెబ్‌సైట్‌ ఉండాలి.. అక్కడ పనిచేసే ఉద్యోగులు, భవనం వివరాలు, ఫీజుల వివరాలను కూడా అప్‌లోడ్‌ చేయాల్సిందే. స్కూల్స్, కాలేజీలు జరుగుతున్న సమయంలో కోచింగ్‌ సెంటర్లు నిర్వహించకూడదు.ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ప్రభుత్వ టీచర్లు, ప్రిన్సిపాళ్లు, రెగ్యులర్‌ లెక్చరర్లు పనిచేయకూడదు. అంతేకాదు కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతి సంస్థ రికార్డులతో పాగుగావెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. అలాగే విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు. ఒకవేళ మధ్యలో ఎవరైనా విద్యార్థి కోర్సు మానేస్తానంటే మిగిలిన కాలానికి ఫీజు తిరిగివ్వాలని కూడా సూచించారు. విద్యార్థుల ఒరిజినల్‌ అకడమిక్‌ సర్టిఫికెట్లు తీసుకోవదు. కోచింగ్ సెంటర్లలో మౌలిక సదుపాయాలు, భద్రత ప్రమాణాలు, మానసిక ఆరోగ్యం నిర్వహణ వంటి లోపాలు ఉంటే 15 రోజుల్లోగా సరి చేసుకోవాలి. ఆ తర్వాత మారకపోతే మొదటి ఉల్లంఘనలకు రూ.50 వేలు, రెండోసారి ఉల్లంఘనకు రూ.లక్ష జరిమానా విధిస్తారు. అయినా సరే మూడోసారి తప్పు చేస్తే రిజిస్ర్టేషన్‌ రద్దవుతుంది.