విశాఖపట్నంవాసులకు ముఖ్యమైన గమనిక.. ఇకపై నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారో అడ్డంగా దొరికిపోతారు. విశాఖలో ట్రాఫిన్ నిబంధనలకు చెక్ పెడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్ లేజర్ గన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం నగర పోలీస్ విభాగానికి రెండు స్పీడ్ లేజర్ గన్స్‌ను జీవీఎంసీ కమిషనర్ అందజేశారు. రెండు స్పీడ్‌ లేజర్‌ గన్లను సీఎస్‌ఆర్‌ నిధులు సుమారు రూ.18 లక్షలతో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చికి అప్పగించారు. ఈ స్పీడ్ లేజర్ గన్‌ల సాయంతో.. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటుగా వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ వ్యవస్థను క్రమబద్ధీకరించవచ్చన్నారు. ఒకవేళ ఎవరైనా అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపినా, హెల్మెట్‌ ధరించకపోయినా, ట్రిబుల్ రైడింగ్ చేసినా, రాంగ్ రూట్‌‌లో వెళ్లినా, ఇతర ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఈ స్పీడ్‌ లేజర్ గన్లకు 100 మీటర్ల దూరంలోనే దొరికిపోతారంటున్నారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినవారికి స్పీడ్ లేజర్ గన్‌ల సాయంతో ఆటోమేటిగ్గా రియల్ టైమ్‌లో ఈ-చలాన్‌ జారీ అవుతుంది అన్నారు. నగరంలో ట్రాఫిక్‌ వ్యవస్థను ఈ గన్‌ల సాయంతో మరింత మెరుగ్గా క్రమబద్ధీకరించవచ్చన్నారు. ఈ రెండు గన్‌లతో పాటుగా త్వరలో మరో స్పీడ్‌ లేజర్‌ గన్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మూడు గన్‌లను ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌) ద్వారా అనుసంధానం చేయనున్నారు. నగరంలో ఎవరైనా ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడితే ఏఐ ద్వారా రియల్‌ టైమ్‌లో చలానాలు జారీ చేయనున్నారు.మరోవైపు విశాఖపట్నం పోలీసులకు జెమినీ ఎడిబుల్స్ & ఫ్యాట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం (CSR) కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 120 సీసీటీవీ కెమెరాలను అందించింది. వీటిని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చికి అందజేశార.ఈ సీసీటీవీ కెమెరాలను నగరంలో అవసరమైన చోట ఏర్పాటు చేస్తామంటున్నారు. తొలి దశలో 44 ప్రాంతాల్లో 120 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు సీపీ.