ఎక్కడ అరకు.. ఎక్కడ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం. అదికూడా టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ మహిళా ఎంపీ నిధులు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రికమండ్ చేయడంతో ఎంపీ స్పందించి ఈ నిధులు కేటాయించారు.. స్వయంగా ఆయనే ట్వీట్ చేసి మరీ విషయాన్ని చెప్పారు. అరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ తనుజా రాణి.. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి MPLADS కింద నిధులు విడుదల చేశారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే తెలిపారు.'అరకు ఎంపీ తనుజా రాణి గారికి ధన్యవాదాలు తెలిపిన.. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు.. వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్ సభ్యురాలు గౌ శ్రీమతి డాక్టర్. గుమ్మా తనుజా రాణి గారు అడిగినవెంటనే స్పందించి తన MP నిధులనుండి రూ. 10.00 లక్షల రూపాయలతో కోవూరు నియోజకవర్గంలోని ఈ దిగువ పనులను మంజూరు చేసినందుకు.. కోవూరు నియోజకవర్గ ప్రజలతరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర PAC సభ్యుల నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు తెలిపారు' అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. 'కొడవలూరు మండలం నార్తురాజుపాలెం గ్రామం లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి.. రూ.5.00 లక్షలు.. విడవలూరు మండలం చౌకచర్ల గ్రామ ST కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ.3.00 లక్షలు.. విడవలూరు మండలం లోని దంపూరు గ్రామ SC కాలనీలో సైడ్ డ్రైన్ నిర్మాణానికి రూ.2.00 లక్షలు' చొప్పున మొత్తం రూ.10 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ తనుజా రాణి నిధులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.దేశంలో ఒక్కో ఎంపీకి కేంద్రం ఏడాదికి రూ.5 కోట్లను MPLADS (Member of Parliament Local Area Development Scheme) కింద కేటాయిస్తారు. లోక్‌సభ ఎంపీలు వారు గెలిచిన సొంత నియోజకవర్గంలో ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని మినహాయింపులతో మాత్రమే వేరే నియోజకవర్గాలకు నిధులు ఇచ్చేందుకు అనుమతి ఉంటుంది. అదే రాజ్యసభ ఎంపీలు మాత్రం ఏ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారో.. ఆ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికైనా నిధులు కేటాయించొచ్చు. రాష్ట్రపతి కొంతమంది ఎంపీలను నామినేట్ చేస్తారు.. వారు దేశంలోని ఏ రాష్ట్రంలోని నియోజకవర్గానికైనా నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంది.