ఇషాన్ బాబూ.. ఏందా కీపింగ్, గ్లౌజ్‌ల కింద నుంచి ఫోర్లు పోతున్నాయి సామీ..!

Wait 5 sec.

ఆరంభ మ్యాచ్‌కి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కాస్త టెన్షన్ అయినట్టు కనిపించాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌తో ఫస్ట్ మ్యాచ్ కావడం, తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు రావడంతో ఫంక్ అయినట్టున్నాడు. బ్యాటింగ్‌లో బాధ్యతగానే జట్టును ముందుకు తీసుకెళ్లినా.. ఫీల్డింగ్ సమయంలో టెన్షన్‌తో కనీసం బంతుల్ని కూడా పట్టుకోలేకపోయాడు. ఆర్సీబీ బ్యాటింగ్ దూకుడుతో ఒకవైపు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే.. మరోవైపు ఇషాన్ కిషన్ వికెట్ల వెనుక బంతులు వదిలేసి బౌండరీలు అందించాడు. ఈజీగా వచ్చిన బంతుల్ని కూడా పట్టుకోలేక గ్లౌజుల కింద నుంచి ఫోర్లు ఇచ్చేశాడు. ఇషాన్ కిషన్ దగ్గర రెండు బంతులు మిస్సవగా.. రెండు కూడా గ్లౌజుల కింద నుంచే వెళ్లిపోయాయి. బౌలర్లను సమన్వయం చేసుకోవడంలో కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. రెండో ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్ వికెట్ పడినప్పటికీ.. పవర్ ప్లేలో మరో వికెట్ తీయలేకపోయాడు. ఆర్సీబీ స్టార్స్ దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. జయదేవ్ ఉనద్కత్, నితీష్ కుమార్ రెడ్డి 10లోపు పరుగులు సమర్పించగా.. మిగతా బౌలర్లంతా 11, 14 పరుగులు ఇచ్చారు. ఈషాన్ మలింగ ఏకంగా 2 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించాడు. 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును గాడిలో పెట్టడమే కాకుండా కేవలం 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆఖర్లో అనికేత్ వర్మ 18 బంతుల్లో 43 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అయితే, బౌలర్లు విఫలం కావడంతో ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లి 38 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లో 61 పరుగులు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 22 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన జాకబ్ డప్ఫీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.