సాకారం కానున్న కడప ఉక్కు కర్మాగారం కల.. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం

Wait 5 sec.

రాయలసీమ ప్రజలకు తీపి కబురు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కీలక అప్డేట్ వచ్చింది. ఏళ్ల తరబడి నెలకొన్న అనిశ్చితి తర్వాత జేఎస్‌డబ్ల్యూ సంస్థ కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె, పెద్దదండలూరు ప్రాంతాల్లో ఈ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. ఈ కర్మాగారానికి రెండు దశల్లో కలిపి మొత్తం రూ.16,350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వైసీపీ ప్రభుత్వంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసినా.. నిర్మాణ పనులను ఆ సంస్థ ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జేఎస్‌డబ్ల్యూ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ప్లాంట్‌ నిర్మాణానికి వేగంగా చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ నుంచి తాజాగా 1100 ఎకరాలను అధికారికంగా బదిలీ చేసింది. ఈ మేరకు జేఎస్‌డబ్ల్యూతో ఏపీఐఐసీ అమ్మకపు ఒప్పందాన్ని సైతం కుదుర్చుకుంది. ఆ భూములకు రూ.55 కోట్లు ఏపీఐఐసీకి చెల్లించింది. ఇంతకుముందు వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ కింద పొందిన పర్యావరణ అనుమతులు కొత్త ప్రాజెక్టు సంస్థకు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులో భాగంగా.. మొదటి దశలో 10 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.4,500 కోట్ల మొత్తాన్ని జేఎస్‌డబ్ల్యూ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ దశను 2029 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా నిర్దేశించింది. ఈ దశ ద్వారా సుమారు వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. రెండో దశలో ఉత్పత్తి సామర్థ్యాన్ని అదనంగా మరో 2 మిలియన్‌ టన్నులకు పెంచేందుకు రూ.11,850 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టు విస్తరణ పనులను 2034 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలన్నది టార్గెట్. రెండో దశలో సుమారు 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే రాయలసీమ ప్రజల కలను సాకారం చేస్తూ పనులు ప్రారంభించనున్నారు.